బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీతో ఉబ్బసానికి గుడ్‌బై


Tue,October 8, 2019 01:05 AM

Asthma
ఉబ్బసం లేదా ఆస్తమావ్యాధి నుంచి పూర్తిగా బయటపడేసే కొత్త చికిత్స ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. పదే పదే వేధించే ఉబ్బస వ్యాధితో జీవితం మీద విరక్తి కలుగుతుంది ఒక్కోసారి. ఇలాంటి వాళ్లు ఉబ్బసానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసి గుండెల నిండా ఊపిరి తీసుకోవచ్చు. ఇందుకు ఉపయోగపడే చికిత్సే బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ.


దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, తుమ్ములు, తెమడ.. ఈ లక్షణాలు సాధారణ దగ్గులోనూ కనిపిస్తాయి. అయితే అది ఉబ్బసం అవునా కాదా అని నిర్ధారించుకోవడానికి లంగ్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఐజిఇ అనే మరో పరీక్ష కూడా ఉంటుంది. దీని ద్వారా మన శరీరంలో ఉండే ఇమ్యునోగ్లోబ్యులిన్‌ అనే ప్రొటీన్‌ తీరును కనిపెట్టవచ్చు. అలర్జీ ఏ స్థాయిలో ఉంది.., ఇన్‌హేలర్లు కాకుండా ఇతర మందులు అవసరమా అనేది ఈ పరీక్షతో కనిపెట్టవచ్చు. ఒకసారి వ్యాధి నిర్ధారణ జరిగితే మొదట తీసుకోవాల్సిన చికిత్స ఇన్‌హేలర్లు. వీటికి అలవాటు పడతామనీ, ఆరోగ్యానికి అంత మంచిది కాదనీ అనుకుంటారు కానీ ఇది అపోహే. నోటిమాత్రల కన్నా వెంటనే ప్రభావం చూపించే మంచి చికిత్స ఇన్‌హేలర్లు. వీటిలో ఉండే స్టెరాయిడ్స్‌ కూడా రక్తంలో కలవకుండా నేరుగా ఊపిరితిత్తుల్లోకే వెళ్తాయి కాబట్టి హాని లేకుండా సమస్యను పరిష్కరిస్తాయి.

ఇన్‌హేలర్‌ పనిచేయకపోతే..

కొంతమందికి ఇన్‌హేలర్లు కూడా అదుపు చేయలేనంతగా ఉబ్బసం పెరిగిపోతూ ఉంటుంది. ఆ దశ దాటి తరచుగా ఊపిరి అందక హాస్పిటల్‌ పాలవుతుంటారు. ఇలాంటి వాళ్లకు రెండు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యునోగ్లోబ్యులిన్‌ జి ని బ్లాక్‌ చేసే ఇంజెక్షన్లను నెలకు ఒకటి లేదా రెండింటిని ఏడాది పాటు తీసుకోవచ్చు. దీన్ని ఇమ్యునోగ్లోబ్యులిన్‌ థెరపీ అంటారు. ఇది కూడా పనిచేయని దశలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్సా విధానం బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ.

బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ అంటే..?

ఉబ్బసం పదే పదే తిరగబెట్టడం వల్ల గాలి గొట్టాల చుట్టూ ఉండే కండరాలు గట్టిగా మారిపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడానికి అనువుగా సంకోచ వ్యాకోచాలు చెందలేవు. గాలి తేలిగ్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్లలేదు. ఫలితంగా ఎన్ని మందులు వాడినా, ఇన్‌హేలర్లు వాడినా ఉబ్బసం అదుపులోకి రాక, ఆస్తమా అటాక్స్‌ పెరుగుతూ ఉంటాయి. పైగా హాస్పిటల్‌లో చేరి వెంటిలేటర్‌ మీద ఉండాల్సిన దుస్థితీ వస్తుంది.

ఇలాంటప్పుడు గట్టిపడిన ఆ కండరాలను కాల్చి, గాలి గొట్టాలకు స్వేచ్ఛ కలిగించడం ఒక్కటే మార్గం. ఆ పని బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ ద్వారా చేయవచ్చు. ఈ చికిత్సలో ఎండోస్కోపీ పద్ధతిని పోలిన విధంగానే ఊపిరితిత్తుల్లోకి బ్రాంకోస్కోప్‌ను పంపి, వేడి ద్వారా గాలి గొట్టాలను కుంచించేలా చేస్తున్న కండరాలను బలహీనపరుస్తారు. ఈ చికిత్సను మూడు దఫాలుగా, మూడు వారాల వ్యవధితో చేస్తారు. మొదటి వారం కుడి పక్క కింది భాగం, రెండవసారి ఎడమ పక్క కింది భాగం, మూడవసారి రెండు వైపుల పై భాగాలకూ చికిత్స చేస్తారు. అయితే ఇలా కండరాలను బలహీనపరచడం వల్ల ప్రత్యేకంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావు. పైగా బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ చేయించుకోవడం వల్ల ఆస్తమా అటాక్స్‌ తగ్గుతాయి. ఇన్‌హేలర్లు వాడాల్సిన అవసరం ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా ఆస్తమా అటాక్స్‌తో హాస్పిటల్‌ పాలయ్యే బాధ తప్పుతుంది. జీవన నాణ్యత పెరుగుతుంది. ఈ చికిత్స ఒక్క రోజులోనే అయిపోతుంది. సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోవచ్చు. చికిత్స తర్వాత వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ, అలర్జీ కారకాలకు దూరంగా ఉంటే చాలు. ఉబ్బసం నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు.
Y.-Gopi-Krishna
డాక్టర్‌ గోపీకృష్ణ ఎడ్లపాటి
సీనియర్‌ పల్మనాలజిస్ట్‌
యశోద హాస్పిటల్స్‌ సికింద్రాబాద్‌
8121022333

74
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles