ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ చికిత్సలతో కొత్త ఊపిరి


Mon,October 7, 2019 11:12 PM

Lungs
ఛాతీలోని ఊపిరితిత్తులను ఎంత స్పష్టంగా చూడగలి గితే వాటిలోని సమస్యలను అంత బాగా అర్థం చేసు కోవచ్చు. చికిత్స కూడా సులభతరం అవుతుంది. సరిగ్గా ఇలాంటి వెసులు బాటును కలిగించింది ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ. ప్రాణాంతకంగా పరిణమించే ఊపిరితిత్తుల వ్యాధులు, ఇబ్బందులను కచ్చితంగా కనిపెట్టడమే కాకుండా వాటికి సరైన చికిత్సలు అందించడం దీని ద్వారా సులువైంది. ప్రాణాంతకంగా పరిణమించే స్వైన్‌ ఫ్లూ మొదలుకుని మందులకు లొంగని ఉబ్బసం, శ్వాసనాళాల్లో ఇరుక్కున్న వస్తువులు, పదార్థాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలు, ఇబ్బందులను సత్వరమే కనిపెట్టి, పరిష్కారం చూపే అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.


మేలైన చికిత్స.. బ్రాంకోస్కోపీ

ఆమె ఏడాది కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నది.. మందులు వాడినప్పుడు తగ్గుతూ, తిరగబెడుతూ పదే పదే పీడించే ఆ వ్యాధితో ఆమె దైనందిన జీవితం నరకంగా మారింది. శ్వాసకోశాలు సమర్థంగా పనిచేయకపోవడం వల్ల శరీరం నీలం రంగులోకి మారిపోవడం మొదలు పెట్టింది. చివరకు సమస్య ప్రాణాంతకమైంది. అప్పుడు లోతైన పరీక్షలు చేసి వైద్యులు చెప్పిన కారణం విని ఆమె షాకయ్యింది..ఆమె ఇబ్బందికి అసలు కారణం.. ఏడాది క్రితం భోజనం చేస్తుండగా పొరపాటున శ్వాసనాళంలోకి చేరిన కందిపప్పు బద్ద ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడమే. ఇది చిన్న సమస్యగానే అనిపించినా అదే చివరికి ప్రాణాల మీదకు తెచ్చింది.

ఇలా ఆమెకే కాదు.. ఎంతో మందికి జరుగుతుంటుంది. కానీ నిర్లక్ష్యం చేస్తుంటారు. పసిపిల్లలు ఆటల్లో భాగంగా పిన్నీసులు మింగేస్తూ ఉంటారు. అవి కాస్తా శ్వాసనాళాల్లో ఇరుక్కుంటాయి. ఇంకొందరికి భోజనం చేస్తుండగా నవ్వినప్పుడు, పొలమారి అన్నవాహికలోకి వెళ్లాల్సిన ఆహార పదార్థాలు శ్వాసనాళాల్లోకి చేరిపోతూ ఉంటాయి. ఇవన్నీ అప్పటికప్పుడు తీవ్రమైన ఇబ్బంది కలిగించకపోయినా దీర్ఘకాలంలో ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. లక్షణాలు కూడా సాధారణ దగ్గును పోలి ఉండడంతో చికిత్స కూడా పక్కదారి పడుతూంటుంది. అయితే ఈ సమస్యను కచ్చితంగాకనిపెట్టగలిగే పరీక్ష ఒక్కటే.. అదే బ్రాంకోస్కోపీ.
Lungs1

పరీక్ష, చికిత్స ఒకేసారి

ఊపిరితిత్తులకు గాలి చేరవేసే శ్వాసనాళాలను బ్రాంకోస్కోపీ ద్వారా పరీక్షించవచ్చు. బ్రాంకోస్కోపీ ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలి గొట్టాలను స్పష్టంగా పరీక్షించవచ్చు. ఈ భాగాల్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థం లేదా వస్తువును కనిపెట్టి, వెంటనే బయటికి తీసుకురాగల టూ ఇన్‌ వన్‌ టెక్నిక్‌ ఇది. ఈ చికిత్సను రిజిడ్‌ బ్రాంకోస్కోపిక్‌ ఫారిన్‌ బాడీ రిమూవల్‌ అంటారు. ఇలా ఇరుక్కునే వాటిలో ఆహార పదార్థాలకు సంబంధించిన పల్లీలు, కూరగాయ, మాంసం ముక్కల వంటి వాటిని ఆర్గానిక్‌ అనీ, లోహపు ముక్కలు, పిన్నీసులు, చెక్కముక్కల లాంటి వాటిని నాన్‌ ఆర్గానిక్‌ ఫారిన్‌ బాడీస్‌ అనీ అంటారు. ఆర్గానిక్‌ రకమైన పదార్థాలు ఎక్కువ ప్రమాదకరమైనవి. ఇవి సాధారణ వాతావరణంలో లాగానే శ్వాసనాళాల్లో ఇరుక్కున్నప్పుడు కూడా కుళ్లిపోతాయి. వాటి సైజు పెరుగుతుంది. వాటి నుంచి రసాయనాలు విడుదలై కెమికల్‌ న్యూమొనైటిస్‌ అనే తీవ్రమైన సమస్య మొదలవుతుంది. నాన్‌ ఆర్గానిక్‌ బాడీస్‌ ఇలా కుళ్లిపోవు. కాని చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ ఊపిరితిత్తుల్లో కొంత భాగానికి గాలి చేరక న్యుమోనియా సమస్య వస్తుంది. అయితే వీటిని ఎక్స్‌రేలో కనిపెట్టవచ్చు. కానీ ఆర్గానిక్‌ పదార్థాలు ఎక్స్‌రేలో కనిపించవు. కానీ ఆ పదార్థం పక్కనున్న ఊపిరితిత్తిలోని కొంత భాగం ఎక్స్‌రేలో నల్లగా కనిపిస్తుంది. దాన్నిబట్టి ఆ భాగాన్ని బ్రాంకోస్కోపీ ద్వారా తొలగించవచ్చు.

రెండు రకాల బ్రాంకోస్కోపీ

బ్రాంకోస్కోపీ రెండు రకాలు. వయసు, ఇరుక్కున్న పదార్థం సైజులను బట్టి మత్తు ఇచ్చి లేదా మత్తు లేకుండా చేస్తారు. మత్తు ఇచ్చి చేసేది రిజిడ్‌ బ్రాంకోస్కోపీ. మత్తు లేకుండా ఎండోస్కోపీ పద్ధతిలో చేసేది ఫ్లెక్సిబుల్‌ బ్రాంకోస్కోపీ. రిజిడ్‌ విధానంలో లోహపు ట్యూబ్‌ను లోపలికి పంపించి, అడ్డుపడిన పదార్థం లేదా వస్తువును బయటకు లాగేస్తారు. ఐదేళ్లలోపు చిన్నపిల్లల్లో గాలి గొట్టాలు చిన్నవిగా ఉండడమే కాకుండా వాళ్లు చికిత్సకు సహకరించరు. కాబట్టి వాళ్లకు మత్తు ఇస్తారు. సాధారణంగా పెద్దవాళ్లకు మత్తు ఇవ్వకుండా చేస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం మత్తు ఇచ్చి రిజిడ్‌ బ్రాంకోస్కోపీ చేయాల్సి రావొచ్చు.

ఏం చేస్తారు?

బ్రాంకోస్కోపీకి 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఫారిన్‌ బాడీ సైజు, మింగిన తర్వాత వైద్యులను కలిసిన సమయాన్ని బట్టి నష్టం ఉంటుంది. కాబట్టి దగ్గు, న్యుమోనియా పదే పదే తిరగబెడుతూ ఉన్నా, మందులకు లొంగక ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. వైద్యులు బ్రాంకోస్కోపీ ద్వారా గాలి గొట్టాలను పరీక్షించి, అడ్డంకిని కనిపెట్టడంతో పాటు అదే సమయంలో ఆ అడ్డంకినీ తొలగిస్తారు. ఇలాంటి టూ ఇన్‌ వన్‌ చికిత్సా విధానం బ్రాంకోస్కోపీలోనే సాధ్యం. పూర్వం ఊపిరితిత్తుల దీర్ఘకాల సమస్యలకు పరిష్కారంగా సర్జరీతో ఛాతీని తెరిచే శస్త్రచికిత్సలను ఎంచుకునేవాళ్లు. కానీ ఇప్పుడు బ్రాంకోస్కోపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సర్జరీతో పని లేకుండానే సమస్యను కనిపెట్టడం, సరిదిద్దడం రెండూ తేలికయ్యాయి.

క్యాన్సర్‌ గడ్డనూ తొలగించొచ్చు కొన్నిసార్లు క్యాన్సర్‌ గడ్డలు ఊపిరితిత్తుల్లోని స్పాంజ్‌లోపల ఏర్పడుతాయి. వీటిని కీమో, రేడియేషన్‌ లేదా సర్జరీ ద్వారా తొలగిస్తారు. కొన్ని క్యాన్సర్లు ఊపిరి తీసుకునే గొట్టాల లోపల పుడతాయి. ఇలా ఊపిరి తీసుకోవడానికి
అడ్డం పడే ఈ గడ్డలను సర్జరీ అవసరం లేకుండానే రిజిడ్‌ బ్రాంకోస్కోపీ ద్వారా సమూలంగా తొలగించవచ్చు.
Dr.-G.-Hari-Kishnan
డాక్టర్‌
హరికిషన్‌ గోనుగుంట్ల
సీనియర్‌ పల్మనాలజిస్ట్‌
యశోద హాస్పిటల్స్‌
సికింద్రాబాద్‌ 8121022333

80
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles