విశ్వజననికి విజయ వందనం!


Tue,October 8, 2019 01:17 AM

durga-devi
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, ఆదిపరాశక్తి శ్రీ చక్రంలో ఆసీనురాలై దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. వివిధ అవతారాలలో అనేక లీలలను ప్రదర్శిస్తూ.. సృష్టి, స్థితి.. సంహారకర్తగా విరాజిల్లుతుంది. ప్రపంచంలోని బలహీనతలన్నింటినీ పారదోలే మహాశక్తి ‘అమ్మ’. ఆత్మశక్తినీ, సంయమన శక్తినీ, శారీరక శక్తినీ, మానసిక శక్తినీ, దివ్యశక్తినీ, వాక్శక్తినీ, ధైర్యశక్తినీ, సహనశక్తినీ ప్రసాదించే ఆది పరాశక్తి విశ్వచైతన్య శక్తిగా పరిఢవిల్లింది. సర్వదశలలోనూ.. దిశలలోనూ శక్తిరూపమై జగత్తును పులకితం చేస్తుంది.


అంతా శక్తిమయం: ప్రపంచమంతా శక్తికి ప్రతిరూపమే. ‘శక్తి’ అన్న పదం ప్రపంచంలోని అన్ని శక్తులనూ జాగృతపరుస్తుంది. ‘సర్వం శక్తిమయం’ అన్న విశ్వసత్యానికి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. జీవించడానికి ఊతమందించే బలమైన ఇచ్ఛాశక్తి, జీవితాన్ని అర్థపరిచే జ్ఞానశక్తి, జీవితానికి కర్తవ్య ప్రబోధం చేసే క్రియాశక్తి ముఖ్యభూమికలై నిత్యసత్య చైతన్య శక్తికి ప్రతీకలై జగన్మాత ఆశీర్వాద ఫలంగా విశ్వవైభవాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. ప్రతీ మాతృస్థానంలోనూ, ప్రతీ ప్రకృతి శక్తిలోనూ, ప్రతీ శక్తికార్యంగానూ ఉన్న, ఉంటున్న, ఉండబోతున్న ఆత్మశక్తి జగన్మాతే. అటువంటి శక్తి ఆరాధనా ప్రతీకయైన విజయదశమి లోకంలోని చెడును రూపుమాపే మంచిని ప్రేరేపించే శక్తి ప్రతిష్ఠా వేదికలా అలరారుతుంది. విశ్వశక్తి విలాసాన్ని తెలియపరుస్తుంది. విశ్వ వికాసానికీ, ప్రాణికోటి ప్రచలనానికీ ఆదిపరాశక్తి అనుగ్రహమే మూలం.

అపరాజిత ‘దుర్గ’: ‘దుర్గం గమయతీతి దుర్గ’- దుర్గమమైన స్థితిని దాటించగల జగజ్జనని దుర్గ. ధర్మహాని, లోకకంటకాలనే విఘాతాలను కలిగించే అసురశక్తులను కాలరాసే సకల దేవతా సమూహశక్తియే దుర్గగా ఆవిర్భవించిందని పురాణోక్తం. జ్ఞాన, ఐశ్వర్య, శక్తి స్వరూపాలను ఏకరూపంగా భావించి ‘దుర్గ’గా ఆరాధించడం అనాదిగా వస్తున్న సదాచారం. దుర్గాదేవి నామాన్ని ఒక మహామంత్రంగా వ్యక్తీకరించింది వేదవాజ్జయం. ‘దుర్గ’ అనే పదానికి అర్థశక్తితోపాటు శబ్ద శక్తి కూడా ఉండడం విశేషం. ‘దుర్గా’ అంటూ నోరారా పిలిచినంతనే జీవన్ముక్తిని ప్రసాదిస్తుందని వ్యాసప్రోక్తం.

‘తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం
వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్‌
దుర్గాం దేవిగం శరణమహం ప్రపదేన
సుతరసి తరసే నమః ॥’


అగ్నిలా స్వచ్ఛమైంది: నిత్య తపఃశక్తితో ప్రకాశించేదీ. విభిన్న లోకరక్షణ శక్తులుగా దేవతలను వ్యక్తపరిచిందీ, సకలలోక శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని శరణుకోరితే దుఃఖసాగరం నుంచి తీరానికి చేర్చే విరాజితగా అలరారుతుంది. సహించలేని కష్టాలనూ, సాధించలేని క్రియలనూ దుఃఖంగా, దుర్మార్గంగా, దుస్సాధ్యంగా, దుష్టత్వంగా, దురాచారంగా, దుర్గతిగా ‘దుః’ శబ్దంతో నిర్వచిస్తారు. వీటన్నింటినీ నశింపజేసే అపరాజితే దుర్గ. విశ్వంలోని దుఃఖాలను పోగొట్టే సమర్థురాలు. అపార సంసార సాగరాన్నీ తరింపజేసే రక్షకురాలు అయినటువంటి ‘దుర్గ’ను ఎంతటి క్లిష్టపరిస్థితులలోనైనా, ఎటువంటి దైన్యహైన్య స్థితులలోనైనా సంయమనంతో ఆరాధిస్తే, వారి వారి బాధలన్నింటినీ తానే స్వయంగా పోగొడతానని అమ్మవారే వరప్రదానం చేసిందని చెబుతుంది దేవీభాగవతం. దేనిని మించిన తత్తం మరొకటి లేదు. ఆ దివ్యత్వమే ‘దుర్గ’ అని శ్రుతివాక్యం. మాటకీ, మనసుకీ అందని అంతర్యామిత్వం అనిర్వచనీయమై ‘దుర్గ’గా భాసిల్లింది.

శక్తి నాట్యమే ఈ ప్రపంచం : ఎక్కడెక్కడ జీవకోటి వల్ల అసాధారణ శక్తి ప్రకటితమవుతుందో అక్కడక్కడ నెలవై ఉంటుంది ఆదిశక్తి. విశ్వజనీనమైన సమస్త ఆదర్శాలనూ తనలో ఇముడ్చుకొనగలిగినంత ఉదారం, విశాలం శాక్తేయం.

‘అహమేవ దాత ఇవ ప్రవమ్యారభమాణా భువనాని విశ్వా
పరోదివా పర ఏనా పృథివ్యై తాతతీ మహినా సంభభూవ ॥

ఆకాశం కంటే ఉన్నతమై, భూమికంటే ఉన్నతమై అంతటా, అన్నింటా నేనే అయి సమస్తలోకాలనూ సృజిస్తుంటాను. అన్నింటిలోనూ విరాజిల్లుతానని జగన్మాతే స్వయంగా ప్రకటించుకుందని ఋగ్వేదం చెబుతున్నది. భక్తి కోసమే భక్తి. ధర్మం కోసమే ధర్మం. కర్మ కోసమే కర్మ అనే ఉత్కృష్ట ఆదర్శాన్ని అనుసరించి దేవీ ఆరాధన కొనసాగుతుంది. అణువణువులోనూ తానే అయి భాసిల్లే ఆదిశక్తి ఆరాధన మనలోని అరిషడ్వర్గాలు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలను తొలిగించి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమత, మానవత, అభిమానం అనే షడ్గుణ సంపత్తిని కలిగించేందుకే ఆ అమ్మ ఉంది. ప్రపంచంలోని సమస్తం ప్రకృతిలో లీనమయ్యేందుకు ప్రళయాన్ని ఆశ్రయించక తప్పదు. కానీ ఆదిశక్తి మాత్రం మూలరూపమై ప్రళయంలోనూ చెక్కు చెదరక ఉంటుంది.

భారతీయ దృక్పథం దసరా: ప్రపంచాన్ని ఏలే ఆదిశక్తిని భారతీయులంతా ఆరాధించుకునే ప్రత్యేకత విజయ దశమికే సొంతం. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆపాదించుకున్న భారతీయత శక్తి ఆరాధనతో మమేకమై విశ్వకల్యాణాన్ని కాంక్షిస్తుంది. విజయదశమి అంటే కేవలం పండుగే ఆదు అనాదిగా వస్తున్న విశిష్ఠ సంప్రదాయం. విజయదశమి అంటే విజయాల వెలుగనే కాదు, విలువలను తెలియజెప్పే విశేష పండుగ. అనుబంధాలనూ, అభివృద్ధినీ కాంక్షించే పండుగ. సహజ ప్రవృత్తికి దగ్గరగా మనుషులనూ, మనసులనూ మళ్ళించే పండుగ. జీవశక్తిని ప్రపంచ శక్తిగా, విశ్వశక్తిని జీవశక్తిగా పరిణమింపజేసే ఆనందాల, ఆకాంక్షల దసరా పండుగ. ఆదిశక్తి ప్రాధాన్యమైన ఆరాధనోత్సవాలు, విజయదశమి సంబరాలు మానవీయతను చాటే ఉన్నత శిఖరాలుగా వర్థిల్లాలనీ, అమ్మ ఆరాధన విశ్వారాధనై పరిఢవిల్లాలనీ కోరుకునే శుభ సంకల్పం దసరా ఇచ్చే సదవకాశంగా భావించాలి.

“సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే,
శరణ్యే త్య్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే”
‘అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే’ అని విశ్వసిస్తూ జీవితతత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం విజయదశమి శుభారంభాన ప్రారంభిద్దాం.
ఇట్టేడు అర్కనందనాదేవి


యావత్‌ ప్రపంచంలో భగవంతుని అభివ్యక్తీకరణను అర్థం చేసుకున్నవారిలో ఏకత్వం భాసిస్తుంది.వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం అనే భిన్న భావమే వారిలో ఉండదు. అత్యున్నతం, అతిసుందర భావజనితం, ఆనందప్రదాయకం అయిన ‘అమ్మ’ భావన విశ్వమానవ సౌభ్రాతృత్వానికి ఆస్కారమిస్తుంది. సృష్టిలోని జీవరాశినంతటినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చి అమ్మలగన్న అమ్మగా నిత్యరక్షణ చేస్తుంది. సకల లోకాలనూ ఏలే దేవతలకు పాలనాశక్తినీ, పోషణాశక్తినీ అందించే కరుణాకలిత
జగన్మాత. నిఖిల తారాగణం, సూర్యాదిగ్రహగణం, సమస్తదేవతా గణం, సకల జీవకోటిగణం ‘అమ్మ’గా కొలిచేందుకు సిద్ధపడే శుభతరుణం విజయదశమి పర్వదినం.

315
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles