సోయా.. రుచుల మాయ!


Thu,October 10, 2019 01:41 AM

మాంసం కంటే ఎక్కువ ప్రొటీన్‌లు పొందాలన్నా.. అధిక మొత్తంలో ప్రోటీన్‌లు లభించాలన్నా.. సోయా అన్నిటిలో బెస్ట్ అంటున్నారు ఆహారనిపుణులు.. కేవలం ఆరోగ్యం విషయంలోనే కాదు.. రుచిలోనూ సోయా వంటలు ది బెస్ట్.. అందుకే ఆ టేస్టీ వంటకాలు మీకోసం..
Soya-Bean


సోయా దోశ

Soya-Dosa

కావాల్సినవి :

సోయా : అర కప్పు
బియ్యం : ఒక కప్పు
మినుపపప్పు : అర కప్పు
నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : సోయా బీన్స్‌ని మెత్తని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి మినుపపప్పు, బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి.
స్టెప్ 2 : ఉదయం బియ్యం, మినుపపప్పు, కాస్త ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో సోయా పౌడర్‌ని వేసి కలుపుకొని పెట్టుకోవాలి.
స్టెప్ 3 : పెనం పెట్టి కాస్త నూనె రాసి.. దోశలు పోసుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని, ఏదైనా చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి.

సోయా దహీ వడ

SOYA-DAHI-WADA

కావాల్సినవి :

సోయా నగ్గెట్స్ : ఒక కప్పు, మినుపపప్పు : అర కప్పు, పెరుగు : ఒక కప్పు, నల్ల ఉప్పు : అర టీస్పూన్, సోంపు : అర టీస్పూన్, జీలకర్ర పొడి : చిటికెడు, కారం : చిటికెడు, స్వీట్ చట్నీ : ఒక టేబుల్‌స్పూన్, గ్రీన్ చట్నీ : ఒక టేబుల్‌స్పూన్, క్యారెట్ తురుము : ఒక టేబుల్‌స్పూన్,
అల్లం తురుము : అర టీస్పూన్, చాట్‌మసాలా : చిటికెడు,
ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : మినుపపప్పును ముందుగా గంటపాటు నానబెట్టాలి. ఈలోపు సోయా నగ్గెట్స్‌ని వేడి నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. అందులో నీళ్లు లేకుండా చేసుకోవాలి.
స్టెప్ 2 : మినుపపప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసి ఉప్పు, అల్లం తురుము వేసి కలుపాలి. రెండు నిమిషాలు ఆగి సోయా నగ్గెట్స్ వేసుకోవాలి.
స్టెప్ 3 : కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. మినుపపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
స్టెప్ 4 : ఒక గిన్నెలో నీళ్లను కాస్త గోరువెచ్చగా మరగబెట్టాలి. ఇందులో కాస్త ఉప్పు వేసి, వేయించుకున్న వడలను ఇందులో వేయాలి. మరో గిన్నెలో పెరుగు, నల్ల ఉప్పు, సోంపు పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపాలి.
స్టెప్ 5 : ఇందులో నీటిలో ఉంచిన వడలు వేసి కారం, జీలకర్ర పొడి, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ వేసి కలుపాలి. చివరగా క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

సోయా లోబియా టిక్కీస్

SOYA-LOBIA-TIKKIS

కావాల్సినవి :

రాజ్మా : ఒక కప్పు, సోయా : 3/4 కప్పు, పసుపు : అర టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్, కారం : ఒక టీస్పూన్, ధనియాల పొడి : అర టీస్పూన్, జీలకర్ర పొడి : అర టీస్పూన్, నిమ్మరసం : రెండు టీస్పూన్స్, పుల్కాలు : 4, ఉల్లిగడ్డ : 1, టమాటా : 1, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : సోయా, రాజ్మా రెండింటినీ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఉడికించాలి. ఆ తర్వాత రాజ్మాని మాత్రం చేతితో మెత్తగా చేసుకోవాలి.
స్టెప్ 2 : ఇందులో పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం పోసి బాగా కలుపుకోవాలి.
స్టెప్ 3 : దీంట్లో సోయా గింజలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. వీటిని చిన్న చిన్న టిక్కీలుగా చేసుకోవాలి.
స్టెప్ 4 : కడాయిలో నూనె పోసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు పుల్కాల మీద వీటిని పెట్టి పైన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మడిచి తింటే ఆ టేస్టే వేరు.

సోయా కీమా కచోరీ

Kheema-Kachori

కావాల్సినవి :

సోయా గింజలు : ఒక కప్పు, మైదా : 3/4 కప్పు,
ఆమ్‌చూర్ పౌడర్ : పావు టీస్పూన్, ఉల్లిగడ్డ : 1,
ధనియాల పొడి : అర టీస్పూన్, గరం మసాలా పొడి : అర టీస్పూన్,
కరివేపాకు : ఒక రెమ్మ,
కారం : అర టీస్పూన్,
ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : వేడినీళ్లలో సోయాగింజలు వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి. వీటిని ఒక పక్కన పెట్టాలి.
స్టెప్ 2 : ఒక గిన్నెలో మైదా, ఉప్పు, కొద్దిగా నూనె పోసి మూత పెట్టేయాలి. కాసేపటి తర్వాత మరికొంత నూనె పోసి మూత పెట్టి పక్కన ఉంచాలి.
స్టెప్ 3 : కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, సోయా, ఆమ్‌చూర్ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, కరివేపాకు వేసి వేయించాలి.
స్టెప్ 4 : ఇప్పుడు మైదా పిండిని చిన్న చిన్న ఉండలు చేసి అందులో సోయా మిశ్రమాన్ని వేసి చిన్న ఉండలా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది.
స్టెప్ 5 : కడాయిలో నూనె ఎక్కువగా పోసి.. అందులో వీటిని వేసి సన్నని మంటమీద వేయించాలి. అంతే.. టేస్టీ కచోరీలు రెడీ!

479
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles