ఎలా బతకాలో నేర్పారు!


Thu,October 17, 2019 12:24 AM

అంగవైకల్యం లేనివారికి విద్యార్హతను బట్టి ఏ సంస్థ అయినా ఉపాధి, ఉద్యోగం కల్పిస్తుంది. మరి దివ్యాంగులు, మానసిక వికలాంగుల పరిస్థితి ఏంటి? వారిని ఎవరు పట్టించుకుంటారు? ఇదే సందేహం బెంగళూరుకు చెందిన మాలా, గిరిధర్ దంపతులకు కలిగింది. దివ్యాంగుల కోసం వారు ఏం చేశారో తెలుసా?
banana-products
దివ్యాంగులు అనగానే అయ్యే పాపం.. అంటూ చాలామంది వారిపట్ల జాలి, దయ చూపిస్తుంటారు. ఇలా వారిని చూసి ఓదార్పుతో నాలుగు మాటలు చెబితే పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు బెంగళూరుకు చెందిన ఈ దంపతులు. వృత్తిపరంగా వీరిద్దరూ మానసిక వైద్యులు కావడంతో.. వారికి ఏదైనా సాయం అందించాలనుకున్నారు. భవిష్యత్‌లో ఎవరి సాయం కోసం ఎదురు చూడకుండా వారికి ఉపాధి కల్పించడానికి సిద్ధమయ్యారు. అందుకోసం తమ ఇంట్లోనే ఓ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులు వారితో తయారు చేయించి, మానసిక చైతన్యం తీసుకురావాలని తలంచారు. అరటి నారతో అందమైన కళాకృతులు తయారు చేయించడం మొదలు పెట్టారు. అందుకోసం ఓ స్వచ్ఛంధ సంస్థతో కలిసి దివ్యాంగులకు, మానసిక వికలాంగులకు అవసరమైన శిక్షణ ఇచ్చారు. వారు రూపొందించిన అరటి నార ఉత్పత్తులు ఎలా విక్రయించాలో కూడా శిక్షణ ఇచ్చారు. దీంతో ఇతరులపై ఆధారపడకుండానే వారంతా ఇప్పుడు సంపాదించగలుగుతున్నారు. శిక్షణ సమయంలో వారికి ఉపకారవేతనాలు, భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. వీరి ఆలోచనకు మస్మర అనే స్వచ్ఛంద సంస్థ తోడైంది. మరింతమంది దివ్యాంగులు, మానసిక వైకల్యం ఉన్నవారిని గుర్తించి, శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తున్నది. మొదట్లో 30 మంది ఉన్న ఈ పునరావాస కేంద్రంలో ఇప్పుడు వేలాది మందికి జీవనభృతి లభిస్తున్నది. దేశవ్యాప్తంగా ఇటువంటి కేంద్రాలను ప్రారంభించి మరింతమందికి జీవనోపాధి కల్పిస్తామంటున్నారు మాలా గిరిధర్ దంపతులు.

458
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles