‘సల్వాజుడుం’పై సినిమా!


Sun,October 20, 2019 12:57 AM

ఈ సినిమా బాగాలేదని ఒక్కరన్నా.. మరొకటి చేయం అనే ఓ చిన్న ట్యాగ్‌లైన్.. సినీ ఇండస్ట్రీనే తనవైపు తిప్పుకునేలా చేసింది. ఈ మాటన్నది ఎవరో కాదు. ఓ యువ దర్శకుడు. అది కూడా తన మొదటి సినిమాకే అలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. అంతే.. అసలేముంది ఆ సినిమాలో? అనే కుతూహలం అందరిలోనూ మొదలైంది. ఇప్పటి వరకు ఫ్రీలుక్ పోస్టర్‌లను విడుదల చేసిన దర్శకుడు.. తాజాగా సినిమా థీమ్‌పై మరో న్యూలుక్ విడుదల చేశారు. దీంతో తెలుగు వారికీ బాగా తెలిసిన ఛత్తీస్‌గఢ్‌లో పేరుగాంచిన సల్వాజుడుం కథాంశంగా వస్తుందని హింట్ ఇచ్చేశాడు. ఈ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకోవడం సరికొత్త వివాదాలకు, సంచలనాలకు తెర తీయనుంది.
Bhimal
మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ.. మొబైల్‌లో ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో రుచికరమైన బిర్యానీ మన ముందుంటుంది. పిల్లలకు ప్లే స్కూళ్ల నుంచి విశ్వవిద్యాలయాల వరకూ చదువుకునే అవకాశం ఉంది. ఇంటిపక్కనే క్ల్లినిక్ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే మెరుగైన వైద్యం పొందే సదుపాయం ఉంది. 100 డయల్ చేస్తే.. ఎలాంటి ఆపద నుంచైనా రక్షించేందుకు పోలీసులున్నారు. మరి.. ఎలాంటి వసతులు లేని అడవుల్లో నిత్యం అంతర్యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆదివాసీలు, గిరిజనుల పరిస్థితి ఏంటి? భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధవార్తలను వింటుంటే మనకు ఒళ్లు జలదరిస్తుంటుంది. అలాంటిది ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో వారు వారొనికొక యుద్ధాన్ని చూశారు. ఆ భీకరపోరులో ఎంతోమంది సమిధలయ్యారు.


అన్యాయం, అక్రమం అని గొంతు చించుకొని అరిచినా.. విన్న నాథుడులేడు. పోరుదారిలో చావడమో, చంపడమో చేశారు. అలాంటి ఇతివృత్తాన్ని, ఆదివాసీల స్థితిగతులను స్టోరీ ఆఫ్ భీమాల్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు నారాయణమూర్తి బల్లెడ. అది కూడా ఓ కాంట్రవర్సీ సబ్జెక్ట్‌తో. జవాన్లు, నక్సలైట్లు, సల్వాజుడుం దళసభ్యులు వారి మధ్యలో ఆదివాసీలు. ఆ అడవిబిడ్డల జీవన విధానం, బతుకు పోరాటం, బంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాలు, అడవితల్లిని కాపాడుకునే విధానం.. ఇవే కథా వస్తువులు.

ఎక్కడిదీ సల్వాజుడుం?

స్టోరీ ఆఫ్ భీమాల్ సినిమాకు కథాంశమైన సల్వాజుడుం 2005 జూన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా బీజాపూర్‌లో మొదలైంది. నక్సలైట్ల నుంచి తమను కాపాడుకునేందుకు అక్కడి పెత్తందార్లు, వ్యాపారులు జనజాగరణ్ అభియాన్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఫలితం శూన్యం. ఆ సమయంలోనే మహేంద్రకర్మ నేతృత్వంలో ఆరంభమైందే సల్వాజుడుం. ఈ దళ సభ్యులు మాత్రమే నక్సలైటను చాలా సందర్భాల్లో ఎదురుదెబ్బ తీశారు. జనజాగరణ్ అభియాన్ వంటి సంఘాలకు అక్కడి ప్రభుత్వ మద్దతు ఉన్నా.. వారు పాలనలో భాగస్వామ్యం కాదు. కానీ సల్వాజుడుం సభ్యులు అలా కాదు. ఈ దళంలో మూడో తరగతి వరకు చదివిన ఆదివాసీ యువకులకు నెలకు రూ.1500 జీతం ఇచ్చి.. సర్కారీ నౌకరీగా గుర్తింపు ఇచ్చారు. సల్వాజుడుం సభ్యుల చేతికి తుపాకీ రాగానే వాళ్లొక సమాంతర వ్యవస్థగా మారిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

దండకారణ్యంలో ఒకవైపు పోలీసులు, మరోవైపు నక్సలైట్లు, ఇంకోవైపు సల్వాజుడుం సభ్యులు. ఈ మూడు వ్యవస్థల మధ్య అడవిలో అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఎవరూ ఊహించనంతగా పోలీసులు, నక్సలైట్లు, సల్వాజుడుం సభ్యులు, పౌరులు వేలాదిగా చనిపోయారు. లక్షలాది మంది ఆదివాసీలు తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు వలస వెళ్లిపోయారు. ఇదే సమయంలో సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రవర్మను నక్సలైట్లు చంపేశారు. సల్వాజుడుం ప్రేరణతో అప్పట్లో మణిపూర్‌లో కూడా ఓ జుడుం ప్రారంభమైంది. ఇలా దేశంలో విపరీతమైన చర్చ రేపిన సల్వాజుడుంపై మొదటి సినిమా తెలుగులో వస్తుండడం విశేషం. ఈ పరిస్థితులన్నిటిపై స్టోరీ ఆఫ్ భీమాల్ సినిమాలో దర్శకుడు నారాయణమూర్తి బల్లెడ చర్చించబోతున్నారు.

నటులంతా రంగస్థలం నుంచే..

స్టోరీ ఆఫ్ భీమాల్ సినిమాలో ఒక్క పోసాని కృష్ణమురళి తప్ప.. నటీనటులంతా రంగస్థల కళాకారులే. కొంతమంది తెలంగాణ గురుకులాల్లో డిగ్రీ చదువుతున్న యువతీ యువకులు. కాలేజీ సెలవు రోజుల్లో తల్లిదండ్రుల అనుమతితో వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ సినిమాలో భాగస్వామ్యం చేశారు. ఇందులో నటుల పేర్లన్నీ.. దండకారణ్యంలోని ఆదివాసీల పేర్ల నుంచే ఎన్నుకున్నారు. ఈ మూవీలో ఒకేఒక్క ఐటెమ్ సాంగ్ ఉంది. దానిని అంధ విద్యార్థినులతో పాడించారు దర్శకుడు. ఇంకో విషయం ఏంటంటే సినిమా షూటింగ్ మొత్తం తెలంగాణలోనే తీశారు. ఎక్కువశాతం షూటింగ్ ఆదిలాబాద్ జిల్లాలోని నాగపూర్ గూడెంలోనే జరిగింది.

క్షేత్రస్థాయి అధ్యయనం..

సల్వాజుడుం ఏర్పాటు, పోరాటం, ఆదివాసీల స్థితిగతులపై మొదట నవలగా రాయాలనుకున్నారు దర్శకుడు. తర్వాత కథలో విషయం.. నవల నుంచి స్టోరీ ఆఫ్ భీమాల్ సినిమాగా రూపుదిద్దుకునే వరకు సాగింది. ఇందుకోసం దర్శకుడు క్షేత్రస్థాయి అధ్యయనం చేశారు. దండకారణ్యంలో ఆదివాసీలను కలుసుకున్నారు. వారి జీవన స్థితిగతులను పరిశీలించారు. సల్వాజుడుం చరిత్ర, పోరాటం, జీవన విధానం తెలుసుకున్నారు. సల్వాజుడుం దళాన్ని రద్దు చేసిన తర్వాత.. దంతెవాడ, బీజాపూర్, కుంట పరిసర ప్రాంతాల్లో.. భద్రాచలం, మణుగూరు, రంపచోడవరం వంటి ప్రాంతాలకు వలసవచ్చిన ఆదివాసీలను కలుసుకున్నారు.

వారితో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసుకొనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. కథానాయకుడుగా సమర్, పోసాని కృష్ణమురళి, నక్షత్ర, హరిచంద్ర రాయల, రాజవర్ధన్, రేఖ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ప్రసు, కెమెరా సునీల్ కుమార్, ఎడిటింగ్ బొంతల నాగేశ్వరరెడ్డి, నిర్మాత ఆరూరి సుధాకర్, రచన-దర్శకత్వం నారాయణమూర్తి బల్లెడ.
-డప్పు రవి

418
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles