రక్తపోటు, మధుమేహం ఉందా? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి


Tue,October 22, 2019 12:59 AM

Kidney-Cancer
మన శరీరంలో కిడ్నీలను చాలా సంక్లిష్టమైన, కీలకమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. అవి శరీరంలో విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోసి బయటకు విసర్జింపజేస్తాయి. అంతేకాదు.. కీలకమైన హార్మోన్లు, ఎంజైమ్‌లను కూడా విడుదల చేస్తుంటాయి. అలాంటి కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి.


చిక్కుడు గింజ ఆకృతిలో ఉండే కిడ్నీల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా ఉండి, కుడివైపు దాని కన్నా కొంచెం పైకి ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే కిడ్నీలు 11-14 సెం.మీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 4 సెం.మీ. మందంతో ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంతోపాటు రక్తపోటును నియంత్రించడంలోనూ కిడ్నీలది ప్రధాన పాత్ర. అందుకే బీపీ ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలను కూడా పూర్తిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మధుమేహంతో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్‌ టెస్ట్‌లు చేయించుకుంటూ ఉండడం తప్పనిసరి. కిడ్నీలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

- కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు
- కిడ్నీలో రాళ్లు
- కిడ్నీ ఫెయిల్యూర్‌
- కిడ్నీ ట్యూమర్స్‌, కిడ్నీ క్యాన్సర్లు.


మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్‌ యూరినరీ ఇన్‌ఫెక్షన్లు కిడ్నీల వరకు పాకి ఇన్‌ఫెక్షన్లకు గురిచేస్తుంటాయి. యాంటీబయాటిక్స్‌తో ఈ సమస్య తొలగిపోతుంది. పురుషుల్లో ఎక్కువగా కనిపించే కిడ్నీలో రాళ్లు అనేక రకాలు ఉండడంతో పాటు ఇసుక రేణువుల పరిమాణం మొదలుకొని గోల్ఫ్‌బాల్‌ సైజు వరకు ఉంటాయి. అంత ప్రమాదకరం కాకపోయినా తీవ్రమైన నొప్పి, బాధను కలిగించే ఈ స్టోన్స్‌కు సైజును బట్టి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

అధిక బరువు, స్మోకింగ్‌, ఆల్కహాల్‌, రక్తపోటు, షుగర్‌ లెవల్స్‌ అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలు కిడ్నీల మీద పడి అది కిడ్నీ ఫెయిల్యూర్‌ సమస్యకు దారితీయవచ్చు. కిడ్నీలు ఫెయిల్‌ అయినపుడు మాత్రమే లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే దీన్ని సైలెంట్‌ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్పనిసరి కావొచ్చు.

కణుతులు ఏర్పడితే..

పుట్టుకతో వచ్చే మూత్రపిండాల్లో కణుతులు, పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్‌ దగ్గరికి చెకప్స్‌కు తీసుకెళ్లినప్పుడు బయటపడుతూ ఉంటాయి. కణితి పరిమాణం బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి, బరువు తగ్గడం, అజీర్ణం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్‌ ట్యూమర్‌గా చెప్పుకునే ఈ కిడ్నీ కణుతులు పిల్లల్లో 4,5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే ఈ కణుతులను పూర్తిగా నయం చేయడం సాధ్యమే.

రీనల్‌ సెల్‌ కార్సినోమా (ఆర్‌సీసీ)

ఈ రకం కణితి పెద్ద వయసువారిలో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా ఇతర చోట్లకు పాకిన భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రెండు కిడ్నీల్లో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్‌టైప్‌లలో ఉండే ఈ క్యాన్సర్‌.. ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలలో, అల్ట్రాసౌండ్‌ వంటి పరీక్షల్లో కనుక్కుంటారు. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్‌ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే స్మోకింగ్‌ చేసేవారిలో చిన్నవయసువారిలోనూ ఈ క్యాన్సర్‌ నమోదవుతున్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. స్మోకింగ్‌, ఆల్కహాల్‌, అధిక బరువు వంటి వాటితో పాటు జన్యుమార్పులు కూడా ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు.

క్యాన్సర్‌ లక్షణాలు కనిపించినప్పుడు ఫిజికల్‌ ఎగ్జామ్‌, బ్లడ్‌ టెస్ట్‌లు, యూరిన్‌ టెస్ట్‌లు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, సీటీ, ఎమ్మారై, క్యాల్షియం లెవల్స్‌ తెలిపే పరీక్షలతోపాటు ఒక్కోసారి ఈ క్యాన్సర్‌ బయటపడే సమయానికి అది ఊపిరితిత్తులకు, ఎముకలకు పాకి ఉండవచ్చు. కాబట్టి చెస్ట్‌ ఎక్స్‌రే, బోన్‌ స్కాన్స్‌ కూడా చేయిస్తూ ఉండాలి. కిడ్నీని మొత్తంగా తీసివేసే సర్జరీతో పాటు క్యాన్సర్‌ రకాన్ని బట్టి కీమో, రేడియోథెరపీలను ఇస్తారు. ఇటీవల కిడ్నీలను లాపరోస్కోపిక్‌ పద్ధతిలో కూడా తొలిగిస్తారు.

క్యాన్సర్‌ కాని కణుతుల్లో కూడా సైజును బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా, కిడ్నీల్లో అవి చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీను తొలగిస్తారు. సర్జరీ తరువాత కిడ్నీ ట్యూమర్‌ స్టేజ్‌ మీద ఆధారపడి సర్జరీని 3 రకాలుగా చేస్తారు.

రాడికల్‌ నెఫ్రోక్టమీ

ఎక్కువగా చేసే ఈ సర్జరీలో కిడ్నీతోపాటు అడ్రినల్‌ గ్లాండ్స్‌, లింఫ్‌ నాళాలు, టిష్యూలను మొత్తంగా తీసివేస్తారు. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తారు.

సింపుల్‌ నెఫ్రొక్టమీ స్టేజ్‌-1

కిడ్నీ క్యాన్సర్‌కు ఒక కిడ్నీని మాత్రం తీసేస్తారు.

పార్షియల్‌ నెఫ్రోక్టమీ

పుట్టుకతో ఒకే ఒక కిడ్నీ ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు కణితి ఉన్నంతమేరకు దాన్ని తీసివేస్తారు. ఒక్కోసారి రెండు కిడ్నీల్లోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా ఇలా కణితి ఉన్న మేరకు మాత్రమే తీసివేస్తారు.

తొందరగా గుర్తిస్తే మేలు

క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి ఒక్క కిడ్నీని మాత్రమే తీసేసినప్పుడు సర్జరీ అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. రెండు కిడ్నీలను తీసేశాక, సరిగా పనిచేయకపోతే వారు క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకుంటూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకోవడం అవసరం.

చికిత్స ముగిశాక కూడా ఫాలోఅప్‌ కేర్‌ తప్పనిసరి. సీటీస్కాన్‌, చెస్ట్‌ ఎక్స్‌రే వంటి టెస్ట్‌లు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండడంతోపాటు స్మోకింగ్‌, ఆల్కహాల్‌ లాంటి అలవాట్లకు దూరంగా ఉంటే కిడ్నీలను కొంతవరకైనా కాపాడుకోగలం.
Kidney-Cancer1

2196
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles