శివకేశవుల ఆరాధనకు వేళ ఇదే!


Sat,November 2, 2019 11:57 PM

Ila-cheddam
మాసాలలో కార్తీకం అత్యంత పుణ్యప్రదమని స్కంద పురాణం ఉద్ఘాటించింది. ఈ కాలానికి సత్యయుగానికి ఉన్నంత విశిష్ఠత, వేదాలకున్నంత ప్రామాణికత, గంగానదికి ఉన్నంత పవిత్రత ఉన్నట్టు వేదవిజ్ఞానులు చెప్తారు. శివకేశవుల విశేష ఆరాధనకు ఏడాదిలో అత్యంత అరుదైన సమయమిది. ఈ మాసం ప్రత్యేకతను తెలుసుకోగలిగితే మరింత భక్తిశ్రద్ధలతో మనసు పెట్టి ఆధ్యాత్మిక సాధనను సఫలీకృతం చేసుకోవచ్చు. ‘శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయగ్‌ం విష్ణు, విష్ణోస్య హృదయగ్‌ం శివ:’ అన్నది యజుర్వేదం. సంధ్యావందనంలోని ఎంతో ముఖ్యమైన స్తోత్రమిది. ‘శివుడు-విష్ణువు ఇద్దరూ వేరు కాదని, ఒక్కరేనని, శివునిలో విష్ణువు, విష్ణువులో శివుడు ఉన్నారని’ తెలియజెప్పడమే దీని పరమార్థం. ‘శైవ-వైష్ణవ తాత్విక మార్గాలు వేరు కావచ్చు. కానీ, పరమాత్మ తత్వం మాత్రం ఒక్కటే’ అన్న భావాన్ని అంగీకరించే వారికి ‘ఆ ఇద్దరిలోనూ’ ఒక్కరే కనిపిస్తారు. అసలు, భారతీయ ధర్మం అద్వైతానికి పెద్దపీట వేసింది కనుక, దేవుళ్లు ఎందరున్నా పరబ్రహ్మ ఒక్కరే. ఆయన ఈశ్వరుడైనా, మహావిష్ణువైనా. ఆఖరకు మనిషిలోనూ, ప్రతి ప్రాణిలోను, సృష్టిలోని అణువణువులోనూ పరమాత్మను చూడగల గొప్ప దృష్టి భారతీయ తత్వానిది. ఏడాదిలో వచ్చే కార్తీకమాసం ఈ ఇరువురు దేవదేవుళ్లకూ అత్యంత ప్రియమైందిగా హైందవ పురాణాలు చెబుతున్నాయి. ఎవరికి వారు తమకు చేతనైనంతలో, శక్తిమేర, ఆర్థిక స్థోమతలకు అనుగుణంగా శివకేశవులను ఆరాధించగలిగితే ఈ ఏడాదికి ఇది చాలు.

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles