నిప్పు నిజాలు


Fri,November 8, 2019 01:04 AM

మనిషి వాడుకున్న, వాడుతున్న సహజ పరికరాలలో ఒకటి నిప్పు. ఇది ప్రత్యేకంగా ఉంటుంది. నిప్పు మిగతా వాటిలా కాకుండా తనంత తాను మనిషినికూడా నాశనం చేస్తుంది. ఈ ప్రపంచం లక్షలాది సంవత్సరాలుగా కాలిపోతూనే ఉన్నది. ప్రకృతిలో నిప్పు అనేది ఒక ప్రత్యేకమైన శక్తి. ఇదొక రసాయనిక చర్య. అడ్డు వచ్చిన అన్నింటినీ సర్వనాశనం చేస్తుంది. కొన్ని రకాల అణువులలోని బంధనాలు దహనం (మంట) అనే నిప్పు చర్యకు సాయం చేస్తాయి. జీవకణాలు వేడిమిని కొంతవరకు మాత్రమే భరించగలుగుతాయి. హద్దులు దాటిన వేడికి ఆ కణాలూ నాశనమవుతాయి.
Vignanam


ఈ మంట జీవకణాలనే గాక మిగతా పదార్థాలను కూడా మార్పులకు గురిచేస్తుంది. రాయికూడా వేడికి విస్తరించి, మళ్లీ ముడుచుకుంటుంది. లోహాలు సైతం వేడికి విస్తరిస్తాయి. జీవకణాలలోని నీరు వేడివల్ల మరుగుతుంది. కణా లు పగిలి పోతాయి. చల్లని చలివల్ల్ల కూడా నీరు గడ్డకట్టి కణాలు పగిలిపోతాయి. అది వేరొక కథ. మొత్తానికి జీవానికి, మంటకు కుదరదు. అయి తే, వాతావరణంలో మంట సహజంగా ఉండి తీరుతుంది. మన పరిసరాలలో కూడా మంట ఉంటుంది. దానికి అలవాటు పడుతూ, సర్దుకొం టూ మనం బతకాలి. మంటను మనం నియంత్రించాలి. దాన్ని మనం వాడుకోవాలి. కలకాలంగా మానవుడు చేస్తున్నది ఇదే. ఈ పరిణామక్రమంలో మంటకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

మనం భూమి అనే ఒక గోళం మీద బతుకుతున్నాం. దాని పైపొరమీద మనం నివసిస్తున్నాం. మాంటిల్ (mantle) అనే ఈ పొర లోపలికి వెళితే, లోపల లోహాలు, రాళ్లు మరుగుతూ ఉంటాయి. ఆ మరుగుతున్న పదార్థం ఇప్పటి వరకు భూమి పైపొరలోకి కూడా చిమ్ముతూ ఉంటుంది. అటువంటి పదార్థం కారణంగానే, భూమిమీద మనకు కనిపించే కొండలు, లోయలు మిగతావన్నీ పుట్టుకు వచ్చాయి. ఇవన్నీ సుమారు 4 బిలియన్ (400 కోట్లు) సంవత్సరాల నాటివని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ పదార్థంలో నుంచే జీవం కూడా పుట్టుకు వచ్చింది. మనం నిప్పు (మంట)ను వశపరచుకుని అదుపు చేయలేదు. జీవం మంటలో నుంచి పుట్టింది. మంట కారణంగానే ఇవాళ జీవం ఇలా ఉంది. మానవుడు మంట (నిప్పు)ను మచ్చిక చేయడం గురించి పరిణామ సిద్ధాంతాన్ని అందించిన డార్విన్ ఒకమాట అన్నాడు. భాష తరువాత మనిషి కనుగొన్న రెండవ గొప్ప విషయమిది అని. ఈ మాట కొంతవరకు నిజమే. అయితే, మనం మొదట్లోలాగా నిప్పు(మంట) మీద ఇప్పుడు అంతగా ఆధారపడడం లేదు. సాంకేతికత, విజ్ఞానశాస్త్రం అభివృద్ధి కారణంగా నిప్పుతో మన జీవన పద్ధతులు చాలావరకు మారిపోయాయి. నిజానికి మంట మొదట్లోలాగ తరచుగా కనిపించడమే తగ్గింది. చివరికి వంటకుకూడా మంట అవసరం లేకుండా పోతున్నది. కొలుములు, భట్టీలు లాంటి మాటలు వినిపించడం లేదు. అసలవి కనిపించడమే లేదు. వాటి అర్థం కూడా ఇప్పటి వారికి తెలియకుండా ఉంది.

అయినా సరే, మనం అగ్ని ఆరాధకులం. మంటను ప్రేమించే వాళ్ళం. అనాదికాలంలో సూర్యుని వెలుగు భూమికి తగిలి ఇక్కడ చెట్లు, జంతువులు పెరిగాయి. కాలం తీరిన తర్వాత వాటిలోంచి కొన్నికొన్ని చచ్చిపోయి నేలలోకి చొచ్చుకుపోగా, ఆ పదార్థమంతా ఒక రకమైన చమురుగా మారింది. మరికొంత బొగ్గుగానూ రూపాంతరం చెందింది. వీటిని మనం ఇవాళటి వరకూ తగులబెడుతూ మన బతుకుల్ని కొనసాగిస్తున్నాం. తగులబెట్టే బదులు వాడుకొని అనికూడా అనవచ్చు. వాడడం అంటే దాన్ని మండించడం కదా. అలనాటి జీవనంలోని కార్బన్ బంధనాలు ఇవాళ్టికి మనకు శక్తి(ఇంధనం)ని దానం చేస్తున్నాయి. ఆధునిక ప్రపంచం దానిపై ఆధారపడి బతుకుతున్నది. కాలక్రమంలో ఈ ఇంధన లభ్యత తగ్గుతున్నది కూడా. కనుక, భవిష్యత్తులో ఆధునిక ప్రపంచం అల్లాడిపోయే రోజులు రావచ్చు. పుణ్యానికి వచ్చింది కదా అని ఇంతకాలంగా మానవులు శిలాజ ఇంధనాలను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. బొగ్గు, చమురు కాస్త బొగ్గుపులుసు వాయువుగా మారి మన వాతావరణాన్ని పాడు చేస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచమంతా వేడెక్కిందీ అని కూడా వారు వాపోతున్నారు. అంటే, మొత్తానికి ఈ వేడి మనలను వదిలే ప్రసక్తే లేదన్న మాట.

నిప్పు (మంట) మానవుని ఉనికినే ఎంతగానో మార్చింది. పారిశ్రామిక యుగంలో దాని ప్రభావం మరీ బయటపడింది. అయితే, మనలాంటి మానవులు మసలడానికి ముందునుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. హోమో ఎరెక్టస్ (Homo erectus: upright man) అనే మానవుడు మొదట నిలువుగా నిలబడ్డాడు. ఇవాళటికి, సుమారు 20 లక్షల సంవత్సరాలకు ముందు ఈ రకం మానవుడు నేలమీద నడిచాడు. 1,40,000 సంవత్సరాల కాలం నాటివరకూ ఉండనే ఉన్నాడు. ఈ మానవుడు కూడా మంటలను వాడుకున్నాడు. అసలు మనిషి మొట్టమొదట మంటను ఎప్పుడు కనుగొన్నాడు అన్న విషయం చెప్పటానికి కుదరదు. ఎందుకంటే, మంటను కనుగొననవసరం లేదు. సహజంగానే అది పుట్టుకు వస్తుంది. అడవులు తగులబడ్డాయి. రాపిడి కారణంగా ఎండిపోయిన చెట్ల్లు మండిపోతాయి. మెరుపు కారణంగా మంటలు పుడతాయి. వాటి కారణంగా ఎన్నో మార్పులు కలుగుతాయి. ఆ మార్పులను మానవుడు తన ప్రయోజనాలకు వాడుకున్నాడు.

కొంతకాలానికి నిప్పును నియంత్రించి తన ఇష్ట ప్రకారం వాడుకోవడం కూడా మానవులు నేర్చుకున్నారు. చివరికి అగ్ని ఆరాధన పద్ధతి మొదలైంది. మంట లేనిదే మనుగడ లేని రోజులు వచ్చాయి. ఈ మాటలు రెండు వాక్యాలలో ముగిసినా, ఆ పనులు జరగడానికి చాలాకాలం పట్టింది. పరిణామంలో ప్రతి సంగతి ఇలాగే ఉంటుంది. మామూలుగా చెప్పుకునే విషయాలు నిజంగా జరగడానికి లక్షల ఏండ్లు పట్టి ఉండవచ్చు. ఈ మంటకూడా ఒకచోట పుట్టలేదు. ఎన్నో చోట్ల పుట్టింది. మెరిసింది ఒక మెరుపు కాదు, ఎన్నో మెరుపులు. రాన్రాను విషయం అర్థమైంది. రకరకాల చోట్ల దాని వాడకం జరిగి ఉంటుంది. చివరకు మానవుడు నిప్పును సృష్టించడం నేర్చుకున్నాడు అనేమాట ఒక్కటే మిగిలింది. ఇది కూడా అంత సులభంగా సాధ్యపడలేదు. పురాతత్వశాస్త్రంలో ప్రతీ విషయాన్ని ఈ దష్టితోనే చూడవలసి ఉంటుంది.
(సశేషం)

డా॥ కె.బి.గోపాలం, సెల్: 9849062055

316
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles