బుజ్జిబుర్రలో బోలెడంత బాధ్యత!


Fri,November 15, 2019 01:22 AM

పిల్లలకేం తెలుసు బాధ్యతలు అని మాట్లాడేముందు ఒక్కక్షణం ఆలోచించండి. ఎందుకంటే వారిలో ఉన్న సామాజిక స్పృహ తెలిస్తే.. ఓరి నా బంగారు కొండో.. అని మెచ్చుకోక మానరు. నిన్నటి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గూగుల్
నిర్వహించిన పలు పోటీల్లో చిన్నారుల సృజనాత్మకతతో పాటు.. వారిలోని సామాజిక కోణం బయటపడింది.

ChildDay
భవిష్యత్‌లో ఈ భూమండలంలోని ఏ ప్రాణికి ఎలాంటి హాని తలపెట్టకుండా.. పర్యావరణాన్ని కాపాడుతూ, అత్యంత ఆధునిక పద్ధతుల్లో స్వేచ్ఛగా జీవించగలిగే సత్తా తమకుందని నేటి చిన్నారులు చాటిచెప్పారు. అందుకోసం వారు ఎలా బతకాలో.. ప్రజా ప్రయోజనార్థం భవిష్యత్‌లో ఎలాంటి ఆవిష్కరణలు చేయాలో ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ఉన్నారు. ఈ చిన్నారుల భవిష్యత్ ఆశలకు వేదికైంది ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్. ఈ నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు కార్టూన్ పోటీలను గూగుల్ ఏటా నిర్వహిస్తుంటుంది. వెన్ ఐ గ్రో అప్, ఐ హోప్ అనే అంశంపై ఈసారి నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా లక్షా పదివేల మంది చిన్నారులు తమ డూడుల్స్ పంపారు.


దేశంలోని 50 ప్రధాన నగరాల నుంచి వచ్చిన ఈ చిత్రాలను ఓటింగ్ ద్వారా, వారి ప్రతిభ ఆధారంగా 20 మందిని ఎంపిక చేశారు న్యాయనిర్ణేతలు. వీరు నుంచి గూగుల్ ఓటింగ్ ద్వారా విజేతలను ఎంపిక చేశారు. ఇందుకోసం ఆరు లక్షల మంది ఓట్లు వేశారు. గుర్గాన్‌కు చెందిన రెండో తరగతి విద్యార్థిని, ఏడేళ్ల దివ్యన్షి సింఘాల్ ప్రథమ బహుమతికి ఎంపికయ్యింది. తుది దశకు చేరుకున్న 20 మందిలో మన తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పి. సాయి హోమేశ్, కె. వినిల్ కూడా చోటు సంపాదించారు. జాతీయ విజేతతో పాటు 5 గ్రూప్‌లను విజేతలుగా ప్రకటించారు.

అన్నీ సామాజికాంశాలే..

డూడుల్ పోటీల్లో గెలుపొందిన చిన్నారులు సామాజికాంశాలపైనే కార్టూన్స్ వేశారు. విశాఖపట్నంలోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ విద్యార్థులు మూడు కేటగిరీల్లో గెలవడం విశేషం. శర్వన్ అనే విద్యార్థి.. సముద్ర జంతువులకు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విముక్తి కలిగించేందుకు ఓ వినూత్నమైన యంత్రాన్ని కనుగొని, సముద్ర జంతువులు, మొక్కలకు హాని కలుగకుండా పరిశుభ్రం చేస్తానని కార్టూన్ రూపంలో వివరించాడు. భాస్వతి బిషోయ్ అనే విద్యార్థిని భవిష్యత్‌లో చంద్రుడిపైకి వెళ్లి పరిశోధనలు చేస్తానని కార్టూన్ రూపంలో చెప్పింది. కోల్‌కతాకు చెందిన అంకిత్ భట్టాచార్య అనే విద్యార్థి.. తాను పెద్దయ్యాక ఎలాంటి ఒత్తిడులు లేని చదువు చెబుతానని, మార్కులకంటే జ్ఞానాన్ని అందించే విద్యను బోధిస్తానని కార్టూన్ రూపొందించాడు. హైదరాబాద్‌కు చెందిన గురుకులం విద్యార్థి కె.వినిల్ భవిష్యత్‌లో మంచి ఆర్కిటెక్ట్‌ను అవుతానని కార్టూన్ రూపొందించాడు. హైదరాబాద్‌కు చెందిన గురుకులం విద్యార్థి సాయి హోమేశ్ భవిష్యత్‌లో తాను ఎత్తైన పర్వతాలు అధిరోహిస్తానని కార్టూన్ రూపొందించాడు.
ChildDay2

అబ్బురపరిచే బహుమతులు

డూడుల్ జాతీయ విజేతకు రూ. 5 లక్షల కళాశాల స్కాలర్‌షిప్, ఆ పాఠశాలలో టెక్నాలజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి రూ. 2 లక్షలు, సర్టిఫికెట్, ట్రోఫీ ప్రదానంతోపాటు గూగుల్ ఆఫీస్‌ను సందర్శించేందుకు అవకాశం ఇచ్చింది. గ్రూపు విజేతలకు.. ఒక్కో గ్రూపునకు రూ.2.50 లక్షలు కాలేజీ స్కాలర్‌షిప్, వారి పాఠశాలల్లో రూ. లక్ష టెక్నాలజీ ప్యాకేజీ, ట్రోపీ, సర్టిఫికెట్, ఇండియాలోని గూగుల్ ఆఫీస్‌ను ఒకసారి సందర్శించే అవకాశం కల్పించింది. అలాగే తుది 20 మందికి సర్టిఫికెట్లతో పాటు కొన్ని ప్రోత్సాహకాలనూ అందిస్తున్నది గూగుల్.

దివ్యాన్షి ది వాకింగ్ ట్రీ

ChildDay3
గుర్గాన్‌కు చెందిన దివ్యాన్షి సింఘాల్ సెలవుల్లో అమ్మమ్మగారింటికి వెళ్లేది. అక్కడి పచ్చని వాతావరణం, చెట్లు పర్యావరణం దివ్యాన్షికి ఎంతో ఇష్టం. ఈ మధ్య సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన దివ్యన్షికి చేదు అనుభవం ఎదురైంది. ఎందుకంటే రోడ్ల విస్తరణ పేరుతో, ఇంటికి అడ్డంగా ఉన్నాయన్న కారణంతో వాటిని నరికివేశారు. అప్పటి నుంచి చెట్లకు రెక్కలొస్తే బాగుండు.. హాయిగా పక్షుల్లా ఎగిరిపోతాయి. కనీసం కాళ్లున్నా హాయిగా పక్కకు జరిగేవి అంటూ బాధపడిందీ బుజ్జితల్లి. ఆ సమయంలోనే గూగుల్ పోటీల గురించి తెలిసి.. చెట్లు షూ తొడుక్కొని సైకిల్ తొక్కుతున్నట్లు, రెక్కలొచ్చి ఎగిరిపోతున్నట్లు కార్టూన్ గీసింది ఈ చిట్టితల్లి. అంతేకాదు తాను పెద్దయ్యాక చెట్లను నరకకుండా వేరే ప్రాంతానికి తరలించడానికి వీలుగా, రోడ్ల విస్తరణకు పక్కకు జరిపేందుకు వీలుగానూ పర్యావరణానికి హాని కలుగకుండా కృషి చేస్తానని ఆశిస్తున్నట్లు ఆత్మవిశ్వాసంతో చెప్పింది. చిన్నారి దివ్యన్షి ఆలోచనను మెచ్చి ఎక్కువమంది ఓట్లు వేయడంతో తన బుజ్జిబుర్రకు ఫిదా అయిన న్యాయనిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు.

- డప్పు రవి
ChildDay4
ChildDay1

267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles