మంట వెనుక మతలబు


Fri,November 15, 2019 01:34 AM

లక్ష సంవత్సరాలనాడు మంట మన అదుపులోనే ఉన్నది. దాన్ని వెలుగు, వేడిమి కోసం అందరూ వాడుకున్నారు. ఎర్రని మంటలు ఎగిసి బతుకులు ముందుకు సాగాయి. లేనిచోట మంట పుట్టించడం కూడా మనిషికి తెలిసిపోయింది. సహజంగా దొరికే మంట కాకుండా, మనిషి తన అవసరానికి నిప్పు సృష్టించడం నేర్చుకున్నాడు. దీంతో వంట మొదలైంది. మిగతా పరిస్థితులూ మారిపోయాయి.


వేటాడడానికి, పిల్లలను కనడానికి, వారి పెంపకాన్ని చూడడానికి, భయం లేకుండా నివసించడానికి మనిషికి అవకాశం దొరికింది. సాంఘిక జీవనానికి కూడా మంట ఆధారంగా నిలబడింది. దానిచుట్టూ చేరి మనుషులు అనేక విషయాలు పంచుకున్నారు. కథలు చెప్పుకున్నారు. వినోదం చేసుకున్నారు. సంఘాలుగా ఏర్పడ్డారు. మంటతో వంట మతలబులు పరిశోధకులకు తోచాయి. మామూలుగా ఏరి తెచ్చుకున్న మాంసం, దుంపలు మొదలైన వాటిని నమలడానికి చాలాకాలం పడుతుంది. అంతసేపు మరొక పనిచేయడానికి వీలుండదు. వండుకున్న వస్తువులను త్వరగా నమిలి మింగవచ్చు. ఆ తిండి త్వరగా అరుగుతుంది కూడా. మొత్తానికి అదొక వెసులుబాటుగా తోచింది.
వంట చేతనైన జంతువు మరొకటి లేదంటే ఆశ్చర్యం కాదు. ఆహార పదార్థాలలో పోషక విలువలు లోపల దాగి ఉంటాయి. జీర్ణక్రియ ద్వారా అవి బయటకు వస్తాయి. జీర్ణక్రియ అన్నది కొంత రసాయనిక చర్య అయితే, మరికొంత మామూలు భౌతిక చర్య. భౌతిక చర్య ఇందాక చెప్పకున్న నమలడంతో మొదలవుతుంది. నమిలి ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తే, లోపల రసాయనానికి అది సులభంగా లొంగుతుంది. దంతాలతో మనం దీనిని నమలడం కాదు, ముందు ముక్కలుగా కొరుకుతాము. చీలుస్తాము. తరువాత నములుతాము. రసాయనాలు వాటిని ఇక లోపల నములుతాయి. కొన్ని జంతువులు కూడా, ముఖ్యంగా పక్షులు ఆహారాన్ని నమిలే ఏర్పాటు చేసుకుంటాయి. రాక్షసబల్లుల కడుపులో కూడా రాళ్లు దొరికాయట. తిండి త్వరగా అరగడానికి ఆ జీవులు రాళ్లను మింగినట్టు లెక్క.
Vignanam

ఈ నమలడం, అరిగించుకోవడం అన్న బాధ్యతలను మంటద్వారా మనం వంటకు అప్పజెప్పాము. పరిణామక్రమంలో వంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతకన్నా ముందు మంట గురించి చెప్పుకోవాలి. అడవి తగులబడుతుంది. అప్పుడు పెద్ద జీవులు ఆ పక్కనే నిలబడి చూస్తూ ఉంటాయి. చిన్న జీవులు మంటనుంచి తప్పించుకోవడానికి పరుగు పరుగున బయటకు వస్తాయి. వేచిచూస్తున్న పెద్దజీవులు వాటిని భోంచేస్తాయి. మంటతో జీవులకు కలిగిన ఈ ప్రయోజనం మనకు అంత సులభంగా తోచదు. కొన్ని తెలివిగల జంతువులు మంటను కృత్రిమంగా పుట్టించి, వాటి ప్రయోజనాలను పొందినట్టు శాస్త్రవేత్తలు గమనించారు. ఉదాహరణకు చింపాంజీలకు మంట గురించి తెలియకపోవచ్చు. కానీ, వాటికి దాని ప్రభావంపై ఒక అవగాహనైతే ఉన్నట్టు వారికి అర్థమైంది. ఎలాగంటే, మంటనుంచి అవి తమను తాము రక్షించుకోవడానికి పరుగులు పెడుతూ, దూరంగా పోతాయి. నిజానికి అవి దూరంగా వెళ్ళవు. వేడికి తట్టుకోగలిగిన ప్రాంతం వచ్చిన తరువాత పక్కన నిలబడి చూస్తుంటాయి. ఒకప్పుడు మనుషులు కూడా ఇలాగే చేసి ఉంటారని పరిశోధకులు అంటున్నారు.

లక్ష సంవత్సరాల నాడు జరిగిన విషయాలకు ఆధారంగా ఎటువంటి సాక్ష్యాలూ దొరకవు. ప్రాచీన కాలానికి అని చెబుతున్న మండిన ప్రాంతాలు మనిషి కారణంగా మండక పోవచ్చు. ‘మనిషి ఒక్కడే మంటను వాడుకున్నాడు’ అని డార్విన్‌ మహాశయుడు చెప్పాడు. ఈ విషయంలో మాత్రం అతను పప్పులో కాలు వేశాడు. కొన్ని పక్షులుకూడా మంటలు వాడుకున్నట్టు పరిశోధకులు గమనించారు. ఫయర్‌ హాక్‌ అనే ఒక డేగవంటి పక్షి ముక్కుతో మండుతున్న కర్రపుల్లను కరుచుకుపోయి ఎండిపోయిన చెట్లు, గడ్డి ఉన్నచోట పడేస్తుంది. అక్కడ మంట పుట్టిన తరువాత చిన్న జంతువులు బయటకు వస్తాయి. పక్షి వాటిని పట్టి తింటుంది.

నిప్పు, మంట అన్నవి ప్రకృతిలో సహజంగా ఉండేవి. జీవనం లేనప్పుడు కూడా నిప్పు, మంట ఉన్నాయి. అదుపు లేని ఈ శక్తిని పరికరంగా వాడుకోవడం మనకు వీలైంది. ప్రస్తుతం మనకు మరెన్నో వెసులుబాట్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా, మంట వాడకం మానే పద్ధతి లేదు. అలనాటి చెట్లు జంతువుల అవశేషాలు, వాటి కారణంగా పుట్టిన ఇంధనాలు దొరుకుతున్నాయి. అంతవరకు వాడుతూనే ఉంటాం. మంటను వాడటం అన్నది మన స్వభావంలో భాగంగా మారిపోయింది. ఒక మిణుగురుతో మంటలు పుట్టించవచ్చు. మనిషి మాత్రమే అటువంటి మిణుగురు పుట్టించగలుగుతాడు. కనుక తెలివికి చెకుముకి అని మారుపేరు పెట్టుకున్నారు కూడా. రాపిడిలోంచి మంట పుడుతుంది. మెదడును కూడా రాపిడ్‌ చేస్తే తెలివి పుడుతుంది. అప్పుడు మంట గురించి మరిన్ని సంగతులు తెలుస్తాయి.

డా॥ కె.బి.గోపాలం, సెల్‌: 9849062055

429
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles