కృత్రిమ మేధో శకం!


Fri,November 15, 2019 01:39 AM

-స్వర్ణయుగం పిలుస్తున్నది!
-‘కృత్రిమ మేధ సంవత్సరం 2020’
-ప్రపంచస్థాయికి మన తెలంగాణ ప్రగతి

మన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు వచ్చే ఏడాది (2020)ని ‘కృత్రిమ మేధ సంవత్సరం’గా ఇటీవల ప్రకటించారు. ఇదే సమయంలో 2019లో ఒక్క సంవత్సరంలోనే 24 శాతం మేర ప్రగతిని సాధించిన రంగంగా ‘ఏఐ’
(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అంతర్జాతీయ రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా ప్రస్తుత కృత్రిమ మేధో శకం పరిచయం చదువండి.

మనిషి డబ్బు చుట్టూ తిరుగుతుంటే, డబ్బు ఇప్పుడు ‘కృత్రిమ మేధ’ (artificial intelligence: AI) చుట్టూ తిరుగుతున్నది. ఇది జగమెరిగిన సత్యం. ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రగతిని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఈ వాస్తవాన్ని తెలిసిన విజేతలు ‘కృత్రిమ మేధ’ వైపు అడుగులు వేస్తున్నారు. అవకాశాల్ని అందుకొంటూ, విజయాలను సృష్టించుకొంటూ ముందుకెళుతున్నారు. అలాంటి వారిలో మన కేటీఆర్‌ ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. కృత్రిమ మేధ (ఏఐ) ఇవాళ యావత్‌ ప్రపంచమంతా విస్తరిస్తున్న తీరు అసాధారణం. భవిష్యత్తు మరింత విప్లవాత్మకమని నిపుణులు ఎంతో భరోసాగా ఉన్నారు. ఈ రంగంలోని అద్భుత అవకాశాల్ని అందుకొని, ప్రగతిలో భాగం కావడం కోసం మన తెలంగాణ సైతం సంసిద్ధమవుతున్నది. ఇందుకు సాక్ష్యం 2020ని ‘కృత్రిమ మేధ సంవత్సరం’గా ప్రకటించడం.
Brain

మానవజాతి అతితక్కువ కాలంలోనే ఈ ‘యంత్ర నాగరికత’ నుంచి ‘తెలివైన జీవనం’లోకి ప్రవేశించింది. ఒక కొత్త సాంకేతిక శకానికి ‘కృత్రిమ మేధ’ శ్రీకారం చుట్టి కొన్ని దశాబ్దాలు కావస్తున్నది. అప్రతిహతంగా పెరిగిపోతున్న ‘ఏఐ’ ప్రగతికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ దాసోహం అంటున్నారు. ‘అత్యాధునిక సాంకేతికతలు’ మన జీవితాల్ని తేజోమయం చేస్తున్న తీరు అమోఘం. ఒక దశలో మనుషులను మించిన మేధస్సును, పనితనాన్ని, నాణ్యతను, కాలనిర్దిష్టతలను తెలివైన యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్‌ వ్యవస్థలు, రోబోలు ప్రదర్శించగలుగుతున్నాయి. రానున్న ‘ఏఐ’ సాంకేతికతలతో ప్రజలకు మరింత మేలు జరుగనున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ పారిశ్రామిక విప్లవం తర్వాత ఆవిర్భవించిన ‘రెండో యాంత్రిక శకం’గా నిపుణులు ప్రస్తుత ‘ఏఐ’ ప్రగతిని అభివర్ణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ప్రచురణ సంస్థ ‘రెలెక్స్‌ (RELX) గ్రూప్‌' వెయ్యికి మించిన ఎగ్జిక్యూటివ్‌లతో ఇటీవల జరిపిన ఒక సర్వే ఫలితాన్ని విడుదల చేస్తూ ‘కృత్రిమ మేధకు ఇదొక స్వర్ణయుగమ’ని నిర్ధారించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగం ఎదుగుదల 2018లో 48 శాతం ఉండగా, 2019లో ఒక్క ఏడాదిలోనే 72 శాతానికి ఎగబాకినట్లు ఇందులో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 93 శాతం వరకు ఎగ్జిక్యూటివ్‌లు ‘ఏఐ సాంకేతికతలదే సమీప భవిష్యత్తు’గా తేల్చారు. ప్రత్యేకించి ‘డీప్‌ లెర్నింగ్‌' లేదా ‘మెషీన్‌ లెర్నింగ్‌' విభాగాలు రానున్న కాలంలో అత్యధిక పోటీని ఇయ్యగలవని కూడా వారు అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో శిక్షణ ఇచ్చే కంపెనీలు తమ ఉద్యోగుల శాతాన్నికూడా రానున్న కాలంలో బాగా పెంచబోతున్నట్టు సర్వేలో పాల్గొన్న అత్యధిక (62 శాతం) ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించారు.

ఒక జీవం లేని వస్తువు, అది కూడా మనిషి సృష్టించింది యంత్రమైనా, కంప్యూటర్‌ వ్యవస్థయినా, రోబో అయినా లేక మరో పరికరమైనా ‘తనదైన తెలివి’ (intelligence) ని ప్రదర్శించడాన్నే ‘కృత్రిమ మేధ’గా చెబుతాం. ఒక సాధారణ చేతివాచీ ‘కీ’ ఇవ్వడం ద్వారా పనిచేస్తే అదొక యాంత్రిక పనితనం. కానీ, అదే తనకు తానుగా, స్వయంచలితంగా సమయాన్ని చూపిస్తూ ఉన్నపుడు ఆ రిస్టువాచీని ‘స్వీయజ్ఞాన (ఆటోమేటిక్‌ లేదా స్మార్ట్‌) యంత్రం’ అనాలి. దీనికోసం దానికి కొంత కృత్రిమ మేధోశక్తి కావాలి. ఒక్క వాచీనేకాదు, వాషింగ్‌ మెషీన్‌, వాటర్‌ ప్యూరిఫయర్‌, సెల్‌ఫోన్‌ వంటి నిత్యజీవిత పరికరాలెన్నో ఇవాళ తమవైన ‘ప్రత్యేక జ్ఞానాల్ని’ (నైపుణ్యాలను) చాటుతున్నాయి. ఈ ‘యంత్రప్రగతి’ సాధారణ స్థితి నుంచి పూర్తి స్వయంచలనం (fully automatic) లోకి మారుతున్నది. దీని వెనుక శాస్త్రవేత్తల అసాధారణ కృషి ఉంది. ఈ యంత్రశక్తి స్వీయ పరిజ్ఞానం అభివృద్ధి ఇప్పటికే అనేక అద్భుతాలను ఆవిష్కరించింది.

మామూలు యంత్రానికి లేదా పరికరానికి ‘తెలివితేటల’ (మేధస్సు)ను ఆపాదింపజేసే సామర్థ్యం ‘ఏఐ’ సాంకేతికతతోనే సాధ్యం. మనిషి ప్రదర్శించే ఇంద్రియజ్ఞానాలను ఈ సాంకేతికతల్లో సుసాధ్యం చేయడానికి నిపుణులు కృషి చేస్తున్నారు. ఇంకా దాదాపు పూర్తిగా మనిషివలె (ఒక్క ప్రాణం తప్ప) వుండే కృత్రిమ మానవుని (హ్యుమనాయిడ్‌ రోబో) సృష్టి ఇప్పటికే తారస్థాయికి చేరింది. గృహావసరాలను తీర్చడం నుంచి ఒంటరితనాన్ని పోగొడుతూ ఒక తోడుగా ఉండడం దాకా రోబోలు పెద్ద ఎత్తున విస్తరించాయి. ఒక దశలో రోబోలలో మానవమేధను మించిన పరిజ్ఞానమూ సాధ్యమవుతున్నది. ఆలోచించడం నుంచి ఆదేశాలను పాటించడం వరకూ అనూహ్యరీతిలో ‘ఏఐ’ సాంకేతికతలను నిపుణులు అభివృద్ధి పరుస్తున్నారు. సమాచారాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం, పలువురి ముఖాలను గుర్తించడం, వివిధ భాషలలో మాట్లాడడం, విన్నాక తిరిగి వాటినే పలుకడం వంటివెన్నో కార్యకలాపాలను అవి తమ పనితనంలో భాగంగా ఆచరణలో పెట్టగలుగుతున్నాయి. ఇవాళ సెల్‌ఫోన్ల నుంచి వాహనాల వరకు ‘ఏఐ’ టెక్నాలజీ ప్రవేశించని రంగం లేదు.

తెలివైన మెషీన్‌ను తయారుచేయాలనే భావన 20వ శతాబ్ది మధ్యలోనే శాస్త్రవేత్తలలో మొదలైంది. అయిదారు దశాబ్దాలలోనే ‘ఏఐ’ రంగం అంచలంచెల ప్రగతిని సాధించింది. 1956లో అమెరికాలోని డార్ట్‌మౌత్‌ కాలేజ్‌లో మొట్టమొదటిసారిగా ఈ పరిశోధన కోసం ఒక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంలోనే ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌' అనే పదప్రయోగాన్ని ఉపయోగించారు. 1985 కల్లా ‘ఏఐ’ మార్కెట్‌ ఒక బిలియన్‌ డాలర్ల వ్యాపారానికి చేరింది. 1990వ దశకం, 21వ శతాబ్ది ప్రారంభం కల్లా వైద్యరంగంలో వ్యాధుల నిర్ధారణ, లాజిస్టిక్‌, డేటా మైనింగ్‌ తదితర అంశాలలో ఏఐ సాంకేతికతల వినియోగం విజయవంతంగా మొదలైంది. కృత్రిమజ్ఞానంతో తయారయ్యే తెలివైన యంత్రాలు, కంప్యూటర్‌ వ్యవస్థలు, రోబోలు సమీప భవిష్యత్తులో మరింత ఆశ్చర్యపరిచే పరిజ్ఞానాలను మనకు అందించగలవనీ నిపుణులు అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ‘ఏఐ’ శక్తి చూపే పనితనం ముందు మానవ సామర్థ్యం బోసిపోక తప్పదేమో.
‘డీప్‌ బ్లూ’ పేరున ఐబిఎం అభివృద్ధి పరిచిన ‘మొట్టమొదటి చెస్‌ ప్లేయింగ్‌ సిస్టమ్‌' 1997లో ప్రపంచ చెస్‌ చాంపియన్‌ గారీ కాస్పొరొవ్‌ను అనూహ్యంగా ఎదుర్కొని ఒక సంచలనం సృష్టించింది. ‘యాపిల్‌' వర్చువల్‌ అసిస్టెంట్‌ ‘సిరి’కి గత అక్టోబర్‌ 4నాటికి ఎనిమిదేండ్లు (విడుదల: 2011 అక్టోబర్‌ 12) నిండాయి. ‘టెస్లా’కు చెందిన తొలి ఆటోపైలట్‌ (సెమీ ఆటోనమస్‌) కారు 2014 అక్టోబర్‌ 9న అభివృద్ధి చెందింది. ‘అమెజాన్‌'కు చెందిన వర్చువల్‌ అసిస్టెంట్‌ ‘అలెక్సా’ కూడా అదే సంవత్సరం (నవంబర్‌ 2014) విడుదలైంది. 2016 ఫిబ్రవరి 14న హ్యూమనాయిడ్‌ రోబో ‘సోఫియా’ వెలుగులోకి వచ్చింది. ఇది 50 ముఖకవళికలను ప్రదర్శించింది. కృత్రిమ మేధో సాంకేతికతలు ఇప్పటికింకా తొలి దశాబ్దంలోనే ఉన్నా, ప్రజలలో అచంచల విశ్వాసాన్నైతే కలిగిస్తున్నాయి. ఏ కారణాల వల్లనైనా మనిషివల్ల పొరపాట్లు జరుగుతాయేమో కానీ, ‘తెలివైన పరికరాలు’ ఎంత మాత్రం తప్పులు చేయవన్న స్థాయికి ‘ఏఐ’ సాంకేతికత ఎదిగింది.

‘కృత్రిమ మేధ’ విప్లవాత్మక ప్రగతి ప్రతీ రంగానికీ విస్తరిస్తున్నది. ప్రత్యేకించి వ్యవసాయం, రవాణా, ఆరోగ్య రక్షణ, బ్యాంకింగ్‌, రిటైల్‌, ఈ-కామర్స్‌, ఉత్పాదకతా రంగాలలో రానున్న కాలంలో అనూహ్య అభివృద్ధిని ఈ సాంకేతికతలు నమోదు చేయనున్నట్టు ప్రపంచ నిపుణులు ఎంతో భరోసాగా ఉన్నారు. వాహనాలకు ఈ శక్తిని సమకూర్చడం (ఆటోనమస్‌ వెహికిల్స్‌) ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలు తగ్గగలవని వారి అంచనా. నేరస్థులను పట్టుకొనే నైపుణ్యమూ మున్ముందు ‘ఏఐ’ సాంకేతికతలతో సాధ్యపడగలదని వారు చెబుతున్నారు. ఇలా భావిప్రపంచం కృత్రిమ మేధో స్వర్ణయుగాన్ని చవిచూడబోతున్నది. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక ప్రగతిలో 14 శాతం పెరుగుదల నమోదు కాగలదని, పిబ్లుసి (PwC India) అధ్యయనం అధికారికంగా పేర్కొంది. ఈ మేరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు 15.7 ట్రిలియన్‌ డాలర్ల భారీ మొత్తం జమ పడగలదని కూడా ఆ నివేదిక వెల్లడించింది.

తొలి ఏఐ విశ్వవిద్యాలయం

అంతర్జాతీయ స్థాయిలో ‘ఏఐ’ రంగం వాణిజ్యపరంగా 2022 నాటికి 4 ట్రిలియన్‌ (4,00,000 కోట్లు) డాలర్ల వ్యాపారానికి చేరుకోవచ్చునని తత్సంబంధ నిపుణులు అంటున్నారు. రాబోయే కాలంలో ఈ పరిశ్రమ మరింత అనూహ్య వేగంతో అభివృద్ధి చెందగలదని కూడా వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే ‘మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయం’ అబుధాబిలో వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. అక్కడి ‘మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌' (Mohamed Bin Zayed University of Artificial Intelligence: MBZUAI) లో గ్రాడ్యుయేట్‌ స్థాయి ‘ఏఐ’ కోర్సును 2020 సెప్టెంబర్‌లో మొదలుపెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యాధునాతన ‘ఏఐ’ వ్యవస్థలను ఇక్కడ చేరబోయే విద్యార్థులు, అధ్యాపకుల కోసం అందుబాటులోకి తేనున్నట్టు విశ్వవిద్యాలయం ప్రకటించింది.
Main-box-1

మనదైన ముందుచూపు!

2020ని ‘కృత్రిమ మేధ సంవత్సరం’గా ప్రకటించడం ద్వారా ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ మనదైన, అత్యంత ముందుచూపును ప్రదర్శించారు. సకాలంలో అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా తెలంగాణ పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదెంతగానో దోహదపడగలదని సాంకేతిక విశ్లేషకుల అంచనా. వచ్చే ఏడాదంతా ‘ఏఐ’ కార్యక్రమాలు, తత్సంబంధ సదస్సులను రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించనున్నట్టు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయం, పట్టణ రవాణా, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఏఐ సాంకేతికతలను వినియోగించుకోగలమని, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, సైబ ర్‌ సెక్యురిటీ, బ్లాక్‌చైన్‌ రంగాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు.

-దోర్బల బాలశేఖరశర్మ

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles