
సివిల్స్ రాయాలన్న లక్ష్యం గలవారు దాన్ని సాధించేవరకు నిద్రపోరు. దానినే జీవిత కలగా మార్చుకుంటారు. ఈ విధంగానే ఆమె కూడా పట్టుదలతో సివిల్స్ పాస్ అయింది. ఇది కేవలం తండ్రికోసమే అంటున్నది. ఈ విజయం వెనుక
తన విషాదగాథ కూడా ఉందంటున్నది.
ఆమె పేరు రితికా జిందాల్. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలను 22 ఏండ్ల వయసులోనే క్లియర్ చేసింది. దేశంలోనే 88వ ర్యాంకు సాధించింది. 2018లో సివిల్స్ సాధించిన ఆమె సిబిఎస్ఇ క్లాస్ 12 నార్తర్న్ రీజియన్ టాపర్‌గా నిలిచింది. దీనికి ఆమె పట్టుదలే కారణం అనుకుంటారు. కానీ పట్టుదలతోపాటు తన విజయం వెనుక తండ్రి ఉన్నాడంటున్నది రితికా. ఆమె పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. రితికా సివిల్స్‌లో ర్యాంక్ సాధించడం తండ్రి కోరిక. ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్లో చేర్పించారు. రితికా ఒకవైపు తండ్రిని చూసుకుంటూ మరోవైపు సివిల్స్ రాయడానికి తయారవుతున్నది. కుటుంబం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. ఎటూ తోచని పరిస్థితి రితికాది. ఎన్ని అడ్డంకులు వచ్చినా పరీక్షలు రాయాలన్నది తండ్రి కోరిక. పట్టుదలతో చదివింది. మొత్తానికి సివిల్స్‌లో ఉత్తీర్ణురాలైంది. తన ఫలితాలతో తండ్రి చాలా సంతోషపడ్డాడు. అది ఆయనకు మరింత శక్తిని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయంటున్నది. ఆమెకు రెండు విషయాలు ఎక్కువగా సహాయపడ్డాయి. క్రమశిక్షణ, దృష్టి పెట్టడం ఈ రెండితోనే తాను ఈ విజయాన్ని సాధించానంటున్నది. ప్రస్తుతం పంజాబ్‌లో నివాసం ఉంటున్న రితికాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సివిల్స్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు విశ్రాంతి, నిద్ర ఉండేలా చూసుకోవాలని ఆమె సూచిస్తున్నది. ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని దానిని అమలుచేసుకోవాలంటున్నది రితిక.