సైన్స్‌పై అవగాహన ఇలా!


Fri,November 22, 2019 12:35 AM

ఒకప్పుడు మనిషి మిగతా జంతువులలాగే నాలుగు కాళ్ళమీద నడిచాడు. కొన్ని పదుల లక్షల సంవత్సరాల నాడు నిలువుగా నిలబడడం నేర్చుకున్నాడు. ఆ ప్రయత్నంతో శరీరంలోని కండరాలు, ఎముకలు అన్నింటిలోనూ మార్పు వచ్చింది. నిలువుగా నిలబడినాక, నడకకూడా సాధ్యమైంది. అంటే, చేతులకు పెద్దగా పని లేకుండా పోయింది. వస్తువులను పట్టుకోవడానికి చేతులు ఉపకరించాయి. ఇలా మొదలైన మానవ జీవన విధానం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది.
Vignanam


మనిషి చేతికి ఒక విచిత్రమైన బొటన వేలు ఉంది. అది మిగతా నాలుగు వేళ్లకు ఎదురుగా కదులుతుంది. కనుక, దీని పట్టుతో వస్తువులను మిగిలిన అన్ని వేళ్ల సాయంతో గట్టిగా పట్టుకోగలుగుతాడు. ఇక పరిశీలన మొదలుపెట్టిన మనిషికి ప్రపంచం కొత్తగా కనిపించసాగింది. రకరకాల వస్తువులను కదిలించి, పెకిలించి, పక్కకు తెచ్చి పరిశీలించి, ప్రయోగం చేయడం కూడా చేతనైంది. లేచి నిలబడినందుకు చూడగలిగిన దూరాలుకూడా పెరిగాయి. దానితో రక్షణకూడా పెరిగింది. తిండికోసం వెతక కలిగిన ప్రదేశం వైశాల్యం పెరిగింది. దూరాలలోని వివరాలను గమనించడం వీలైంది. అన్నింటికన్నా ఆశ్చర్యంగా నిటారు మనిషికి మెదడుకూడా ఎదిగింది. అది మిగతా జంతువుల కన్నా ఎక్కువగా వికసించింది.

కేవలం కండ్లతోనే కాకుండా ప్రపంచాన్ని ఆలోచనలతో అర్థం చేసుకోవడం, గమనించడం వంటి కొత్త విద్య మనిషికి క్రమంగా వంటబట్టింది. నిలువు మనిషి నిలబడడానికే పరిమితం కాకుండా ఆలోచించడం చేతనైన మనిషిగానూ ఎదిగాడు. మిగతా జంతువులకు లేని ఈ కొత్త వెసులుబాటు భూమిపైనే మనిషిని ఉన్నతునిగా నిలిపింది. అటువంటి మనిషి ప్రపంచం మీద అధికారాన్ని సంపాదించాడు. కానీ, చాలా చిత్రంగా తనకున్న ప్రత్యేకమైన, సహజసిద్ధమైన శరీర, మానసిక శక్తులను మాత్రం మరిచిపోయాడు. ఆలోచించకుండా బతికేసే స్థితికి చేరుకొంటున్నాడు. ఇంకా, ఒకడుగు ముందుకేసి అర్థం చేసుకోకుండా బతికేస్తున్నాడు. తన సహజ మనుగడకు అతీతంగా బతుకుతున్నాడు. సైన్స్‌ అన్నది ఉన్నదని తెలియకుండా దాన్ని వాడుకుంటున్నాడు. తానే సైన్స్‌ అన్న భావనను మనిషి పూర్తిగా మరిచిపోయాడు.

ఇప్పటి మనిషికి ఉందో లేదో కానీ, మొదట్లో మనిషికి తన ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్న కోరికైతే బలంగా ఉండేది. ఇప్పుడైతే జరుగుతున్న మామూలు, విపరీతమైన విషయాలనుకూడా పట్టించుకోకుండా మనిషి బతుకుతున్నాడు. ఒకప్పటి మనిషి ఇలా కాదు. వెలుగు, చీకటి తేడాకూడా తెలియని కాలంలో మనిషి బతికిన తీరును ఒకసారి ఊహిస్తే వాస్తవం తెలుస్తుంది. సాయంత్రం అవుతుంది. వెలుగు తగ్గుతుంది. వేటకు వీలుండదు. ఒకేచోట ఉండిపోవలసి వస్తుంది. రక్షణ కరువవుతుంది. అప్పుడు మనిషి కదలకుండా ఒకేచోట ఉండిపోయాడు. కనుక, నిద్ర వచ్చింది. ఉదయమైన తరువాత, సూర్యుని కిరణా లు కళ్ళలోకి గుచ్చుకున్నాయి. ఏదో తేడా వచ్చిందన్న సంగతి తెలిసి వచ్చింది. అట్లా నాలుగు రోజులు గడిస్తే లేదా నాలుగేండ్లు గడిస్తే ఉదయాస్తమయాల సంగతి మనిషికి తెలిసిపోయింది. పరిశీలన ఈ రకంగా మొదలైంది.

ఇలా ముందుకు సాగిన మనిషి ఎన్నెన్నో విజయాలను సాధించాడు. వాటి గురించి గట్టిగా ఆలోచించాడు. అట్లా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచాయి. అప్పుడు మనిషికి ప్రకృతిపై కొంత అవగాహన పెరిగింది. కొంతకాలానికి ఈ అవగాహనకు సైన్స్‌ అని పేరు పెట్టుకున్నాం. ఇలా వచ్చిన తేడాలను గమనిస్తే, ఇప్పుడు మనకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది.

డా॥ కె.బి.గోపాలం, సెల్‌: 9849062055

278
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles