ప్రాణవాయువు కావాలి!


Fri,November 22, 2019 12:47 AM

డబ్లుహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) అధ్యయనం మేరకు ఢిల్లీ మహానగర వాతావరణ నాణ్యత ‘అత్యల్పాని’కి పడిపోయింది. ‘ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’లో ఏకంగా ప్రభుత్వమే దీనినొక ‘గ్యాస్‌ చాంబర్‌' (విషవాయువుల గది)గా ప్రకటించిందంటే, తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వాతావరణంలో విషవాయువులు ‘అత్యంత అథమస్థాయికి చేరిన నగరం’(worst)గా ప్రపంచ నగరాల జాబితాలోకి ఢిల్లీ చేరినట్లు పై ఐరాస సంస్థ ప్రకటించింది. ‘బాబోయ్‌, అసలేమైంది’ మన దేశ రాజధానికి? అక్కడి వాతావరణ పరిస్థితిని తెలిపే ప్రత్యేక వ్యాసం చదువండి.
Sun


అత్యంత నివాసయోగ్యమైన భూమిపై మనిషి ప్రాణవాయువు కోసం ఇంతలా గిలగిలలాడే పరిస్థితి వస్తుందని ఎవరమూ అనుకొని ఉండం. ప్రగతి పరుగులో పడి మానవులు ఆఖరకు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కొంటున్న వైనానికి తాజా నిదర్శనం ఢిల్లీ కాలుష్య ఉదంతం. ఎంతో అనుకూల వాతావరణంలో, మహాకట్టడాల నడుమ, సుసంపన్నమైన భారతీయ చారిత్రక ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తూ, అప్రతిహత నగరంగా వేల ఏండ్లు వెలుగొందిన ‘ఇంద్రప్రస్థం’ (మహాభారత కాలం నాటి పేరు) ఇవాళ యావత్‌ ప్రపంచం వేలెత్తి చూపించే దుస్థితికి చేరుకోవడం బాధాకరం.

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల (మళ్లీ) వాయుకాలుష్యం శ్రుతిమించి, ప్రజల ప్రాణాలమీదికి వచ్చింది. సూర్యుని కప్పేసిన దట్టమైన విషపు పొగమంచు ఆ ప్రాంతప్రజలను ఇప్పటికింకా భయభ్రాంతులను చేస్తున్నది. డబ్లుహెచ్‌ఓ అధ్యయనం ప్రకారం భారతదేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ప్రపంచంలోని 1650 నగరాలలోకెల్లా అత్యంత అధమస్థితి (Worst) లో ఉన్నది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు ప్రతి ఏటా మన దేశంలో వాయుకాలుష్యం బారిన పడి సుమారు 15 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్టు అంచనా. దేశవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో ఇదే ‘అయిదో అతిపెద్ద హంతకి’గా నమోదైంది. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం (ఆస్తా)వల్ల మరణిస్తున్న ప్రపంచ బాధితుల్లో ఇండియావారే అత్యధికమని కూడా ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ వెల్లడించింది. ఢిల్లీలోని అత్యల్ప గాలినాణ్యత సుమారు 22 లక్షల ఊపిరితిత్తులపై లేదా 50 శాతం పిల్లలపై పూడ్చలేని నష్టాన్నే కలిగించవచ్చునన్నది విశ్లేషకుల అంచనా.

ఢిల్లీలో గత కొన్నేండ్లుగా దాదాపు ఏడాది పొడుగునా పూర్తి నాణ్యమైన ప్రాణవాయువును పీల్చుకొనే పరిస్థితులు లేనే లేవని విశ్లేషకులు అంటున్నారు. ఇక, ప్రత్యేకించి అక్టోబర్‌-నవంబర్‌ మాసాలలో అయితే శ్రుతిమించి పోతున్నదని వారంటారు. ఈ ఏడాది గత దీపావళి తర్వాత కూడా ఇదేలా పరిస్థితి గతంలోలా పునరావృతమైంది. టన్నులకొద్దీ పంటవ్యర్థాలను కాల్చడం, వాహనాల కాలుష్యాలు వంటి చర్యలూ యథాతథంగా కొనసాగుతుండడంతొ అది మరింత అధికమైంది. దీంతో ప్రాణవాయువు కోసం గిలగిలలాడే దయనీయ దుస్థితి నెలకొన్నది. చివరకు ఢిల్లీలో అడుగు పెట్టడానికి ప్రజలు వెనుకంజ వేసే పరిస్థితి వచ్చింది. విదేశీ ప్రతినిధులూ దేశ రాజధాని నగరానికి రావడానికి భయపడుతున్నారని తాజా పార్లమెంటు సమావేశాల సందర్భంగా మన రాష్ట్ర టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచ వాయు కాలుష్య నగరాలలో దేశంలోని 9 నగరాలు ఉండటం దురదృష్టకరమని కూడా ఆయనన్నారు.

సాధారణంగా ఢిల్లీలో వాహనాల ఉద్ఘారాల వల్లనే సుమారు 41 శాతం కాలుష్యం పేరుకు పోతున్నట్లు భారత మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ 2018 అక్టోబర్‌లోనే ఒక పరిశోధనాత్మక పత్రాన్ని ప్రచురించింది. దీనితోపాటు దుమ్ము, ధూళిది 21.5 శాతం, పరిశ్రమలది 18 శాతం కాలుష్యకారక వాయువుల వాటాగా ఉన్నట్టు ఆ నివేదికలో తెలిపారు. సాధారణంగా జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఢిల్లీలోని ‘గాలి నాణ్యతా సూచీ’ (Air quality index) పెద్దగా ప్రమాదకరం కాని ఓ మోస్తరు స్థాయి (101-200)లోనే ఉంటుంది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌లోగా 3 నెలలలోనే బాగా క్షీణించిపోతుంది. తొలుత అత్యల్పం (301-400)గా, తర్వాత తీవ్రం (401-500)గా, ఆ పిమ్మట ప్రమాదకర (500+) స్థాయికి సూచీ చేరుకొంటున్నది. దీనికి పంటవ్యర్థాల కాల్చివేత ఒక్కటే కారణం కాదని, రోడ్డుమీది ధూళి, వాహన కాలుష్యం, శీతల వాతావరణం, బాదర్‌పూర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ వంటివన్నీ కారణమవుతున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు.

2017 నవంబర్‌లో ఏర్పడిన ఒకానొక తీవ్ర కాలుష్య స్థితిని ‘గ్రేట్‌ స్మాగ్‌ ఆఫ్‌ ఢిల్లీ’గా పిలుస్తున్నారు. ఆనాటి వాయు కాలుష్యం ఆమోదస్థాయికన్నా ఎంతో కిందికి పడిపోయింది. వాతావరణంలో ‘పీఎమ్‌ 2.5’ (Particulate Matter: PM), ‘ఫీఎమ్‌ 10’ రేణువులు 1 క్యూబిక్‌ మీటరుకు ఉండే మైక్రోగ్రామ్స్‌ సంఖ్య సురక్షిత పరిస్థితులలో 60 నుంచి 100 వరకు ఉంటే, పై తీవ్రతర వేళలలో అవి 999 చేరినట్టు తెలుస్తున్నది. ప్రతీ ఏడూ వాతావరణంలోని గాలి నాణ్యతను మైక్రాన్‌ (మీటరులో 10 లక్షల వంతు)ల గాఢతతో కొలుస్తారు. ఉదా॥కు ‘పీఎమ్‌10’ (10 మైక్రాన్లకన్నా చిన్న రేణువులు) లేదా ‘పీఎమ్‌2.5’ (2.5 మైక్రాన్లకన్నా చిన్నవి లేదా మానవ వెంట్రుక పరిమాణం కంటే 25-100 రెట్లు తక్కువ పల్చనివి) కొలతలలో సూక్ష్మరేణువుల సంఖ్య సదరు (10 లేదా 2.5) సంఖ్యకంటే తక్కువగా ఉంటుంది.

2008 నుంచి 2013 వరకు ప్రపంచవ్యాప్తంగా పీఎం స్థాయిల డేటాను గమనిస్తే సుమారు 91 దేశాలలోని 1600 నగరాలలో 1 క్యూబిక్‌ మీటరుకు వున్న మైక్రోగ్రాముల ( సంఖ్య 26 నుంచి 208 వరకు నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన సగటు నాణ్యత 71 ఉండగా, మన దేశంలో అత్యధిక పీఎం స్థాయిలను కలిగి ఉన్న నగరాలు 13 నుంచి 25 వరకూ ఉన్నాయి. డబ్లుహెచ్‌ఓ అధ్యయనం మేరకు ఢిల్లీ వాతావరణ నాణ్యత ‘అత్యల్పాని’కి పడిపోవడంతో ‘ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఒక ‘గ్యాస్‌ చాంబర్‌' (విషవాయువుల గది)గా మారిందని సీఎం కేజ్రీవాల్‌ స్వయంగా ప్రకటించారు. వాతావరణంలో విషవాయువులు ‘అత్యంత అథమస్థాయికి చేరిన నగరం’(worst)గా ప్రపంచ నగరాల జాబితాలోకి ఢిల్లీ చేరినట్లు ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ప్రకటించింది.

డబ్లుహెచ్‌వో సర్వే (అధ్యయనం) ప్రకారం 2010లో ఢిల్లీలో ‘పీఎమ్‌10’ సగటు స్థాయి 286 ఉండగా, 2013లో ‘పీఎమ్‌2.5’ సగటు స్థాయి 153 నమోదైంది. ఇవి అనారోగ్య కారకాలేనని నిపుణులు తెలిపారు. ఇటీవలి కాలం వరకూ భారతదేశంలో అత్యంత అధమస్థాయి కాలుష్య నగరంగా గ్వాలియర్‌ (మధ్యప్రదేశ్‌) నమోదు కాగా, అక్కడ పీఎమ్‌10, పీఎమ్‌2.5ల స్థాయిలు 329 144 నమోదైనాయి. పోల్చి చూసినప్పుడు, లండన్‌లో పీఎమ్‌10, పీఎమ్‌2.5 స్థాయిలు 22 16 లుగా ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం డబ్లుహెచ్‌ఓ అధ్యయనం ప్రకారమే పీఎమ్‌ స్థాయిలు ఏ ఏటికా ఏడు అధ్వాన్న స్థితికి చేరుతున్నాయి. పరిణామాలు చేయి దాటక ముందే ప్రభుత్వాలతోపాటు అందరూ తక్షణం స్పందించి, దీనిని తీవ్రసమస్యగా పరిగణించాలని కోరుకొందాం.


బాబోయ్‌ ఢిల్లీ!

ఢిల్లీలో స్వచ్ఛమైన ప్రాణవాయువు కోసం ‘ఆక్సీజన్‌ బార్లు’ వెలుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీన్నిబట్టి, ఇక ముందు స్వచ్ఛగాలి కోసమూ ప్రజలు డబ్బు ఖర్చు పెట్టవలసి రావచ్చు. వాతావరణంలో గాలినాణ్యత స్థాయిలు 20 ్బ (పీఎమ్‌10), 10 ్బ (పీఎమ్‌2.5) ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యానికి హాని కలక్కుండా సురక్షితం కాగలదని డబ్లుహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) నిర్దేశించింది. ఢిల్లీలో 2015 డిసెంబర్‌-జనవరిలో సగటు పీఎమ్‌2.5 స్థాయిలు 226 ్తైg/m3 ఉన్నట్టు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇదే సమయంలో బీజింగ్‌ (చైనా)లో 95 స్థాయి నమోదైంది. దీన్నిబట్టి బీజింగ్‌కంటే ఢిల్లీలోని గాలి నాటికే రెండింతలు కలుషితమైంది. 2017 అక్టోబర్‌ నాటికి నగరంలోని వివిధ ప్రాంతాలలో నమోదు చేసిన గాలి నాణ్యతా సూచీ (air quality index: AQI) 999గా నమోదైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కాలుష్యపు గాలి రోజుకు 45 నుంచి 50 సిగరెట్ల పొగకు సమానం.

-దోర్బల బాలశేఖరశర్మ

289
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles