సంక్రాంతి.. పందెం పాటలు!


Tue,January 14, 2020 12:50 AM

కాలం ఆగదు కదా? కానీ ఈ మూడ్రోజుల సంక్రాంతి సంబురాలు చూస్తుంటే కాలం ఇక్కడే బంధించబడితే బాగుండు.. ఈ ఉత్సాహం ఎప్పటికీ ఉంటే మంచిగుండు అనిపిస్తుంది. దానికి తోడు ఇప్పుడు పాటల పందిళ్లొచ్చాయి. అచ్చమైన పల్లెను.. స్వచ్ఛమైన జానపదాన్ని జతచేసి సంక్రాంతి పాట ఊరేగుతున్నది. సంక్రాంతి వైభవం ఎలాంటిదో పాటలో చూపిస్తూ ఏడాదంతటికీ సరిపోయే ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతమైన చిత్రీకరణతో.. మంచి భావమున్న పాటలు రూపొందిస్తూ పండుగకు కొత్త కాంతిని తెస్తున్నారు. ఒక రకంగా పోటీ పడుతున్నారు.


రోజులెన్నో వస్తుంటాయి.. పోతుంటాయి. మనం.. ఇలా ప్రతీరోజూ కాలంతో ప్రయాణిస్తుంటాం. కానీ.. ఈ మూడ్రోజులు కాలం మనతో ప్రయాణిస్తుంది. ప్రేమలు.. ఆనందాలు.. ఆప్యాయతలు.. బంధాలు బండికట్టుకొని.. రంగు రంగుల రంగవల్లుల మధ్య బొడ్డెమ్మలై వాలిపోతాయి. ఈ అందమైన పండుగ వాకిట్లో కోడి పందాలే కాదు.. పాటల పందాలు కూడా పోటీ పడుతున్నాయి. ‘హేమంత మంచుల్ల సూరీడూ ఏడుగుర్రాలెక్కి వచ్చాడూ’ అంటూ ఉర్రూతలూగిస్తుంటే.. ‘గొబ్బీయల్లో గొబ్బీయల్లో గోగులకావలో పిలగా’ అని ఉల్లాసపరుస్తున్న సంక్రాంతి పాటల పదనిసలు ఆలకిద్దాం.


హేమంత మంచుల్లో సూరీడుసింగర్‌: మంగ్లీ
డైరెక్టర్‌: దామురెడ్డి
లిరిక్స్‌: కాసర్ల శ్యామ్‌
మ్యూజిక్‌: మదీన్‌ ఎస్‌కే
వ్యూస్‌: 31,57,441+
సమర్పణ: మంగ్లీ
అందమైన లొకేషన్లలో తీసిన ఈ పాటను చూడగానే మనకు కూడా ఆ లొకేషన్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. కాసర్ల శ్యాం ఈ పాట రాశారు. మంగ్లీ పాడిన ఈ పాట.. ‘హేమంత మంచుల్లో సూరీడు ఏడుగుర్రాలెక్కి వచ్చాడు.. ఉత్తరదిక్కుల్లో వెచ్చటి కాంతులు తెచ్చాడు’ అని స్టార్టవుతుంది. కొత్త అల్లుళ్ల గురించి.. రంగవళ్లుల గురించి.. గొబ్బెమ్మల గురించి ప్రస్తావిస్తూ.. ‘శ్రీమంతుడై కొత్త అల్లుడూ అత్తారింటికి వచ్చాడు.. చీకటి వెల్లగొట్టీ కల్లాపీనే చల్లేస్తుంటే.. తలంటూ స్నానాలతో ఇల్లూ వాకిలి తెల్లావారే’ అని పల్లె.. పల్లెలోని ప్రజలు ముస్తాబైన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సంక్రాంతి స్పెషల్‌ అయిన గంగిరెద్దుల గురించి.. ‘గంగడోలు గంగిరెద్దు.. అయ్యగారికి దండం పెట్టా.. హరిదాసుకు అమ్మగారు బియ్యంబిచ్చెనటా’ అంటూ పాటను పరిపూర్ణం చేశారు.


వసంతం వాకిట నిలిచిసింగర్‌: తేలు విజయ
లిరిక్స్‌: తైదల అంజయ్య
మ్యూజిక్‌: శ్రీకాంత్‌
వ్యూస్‌: 1,12,449+
సమర్పణ: ఎస్‌టీవీ ఆడియోస్‌ అండ్‌ వీడియోస్‌
జానపద గాయని తేలు విజయ పాడిన పాట కూడా 2020 పాట పందెంలో నిలిచింది. ‘వసంతం వాకిట నిలిచి రంగులే పరిచింది. నింగిలో సుక్కల దించి ముగ్గులే వేసింది. ఊరంత సందడి చేసి పండగ చేసింది. పైరగాలి పంటనేలపై మంచుముత్యాలు కురిసింది’ అంటూ పాట స్టార్ట్‌ అవుతుంది. ‘అలుకు జల్లిన పల్లె లోగిలి రంగవళ్లులూ పూసింది. నీలిమబ్బు నేలకు వంగి తొంగి తొంగి చూసింది’ అని అంజయ్య మంచి సాహిత్యాన్ని అందించారు.

గొబ్బీయల్లో గొబ్బీయల్లోసింగర్స్‌: నర్సన్న, కనకవ్వ, అఖిల, రామక్రిష్ణ
డైరెక్టర్‌: దామురెడ్డి
లిరిక్స్‌: చరణ్‌ అర్జున్‌
మ్యూజిక్‌: చరణ్‌ అర్జున్‌
వ్యూస్‌: 4,08,734+
సమర్పణ: మైక్‌టీవీ
మైక్‌ టీవీ 2020 సంక్రాంతి స్పెషల్‌సాంగ్‌లో జీవం.. జీవితం కనిపిస్తుంది. నల్లగొండ గద్దర్‌ నర్సిరెడ్డి.. ‘నీ ఇల్లూ.. నీ పిల్లలు సల్లాగుండా హరీహరీ నారాయణా. నీ ఇంట బంగారు సిరులా కుండా.. హరీహరీ నారాయణా’ అంటూ హరిదాసుగా కనిపించడంతో ఈ పాట స్టార్టవుతుంది. మైక్‌టీవీ ఈ సారి చక్కటి ప్రయోగం చేసి అందరి ప్రశంసలూ అందుకుంటున్నది. చేలల్లో.. పంట పొలాల్లో.. పని పాటల్లో పాటలందుకునే అచ్చమైన మట్టి మనుషులను పరిచయం చేశారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కనకవ్వ అదరగొట్టింది. ‘గొబ్బీయల్లో గొబ్బీయల్లో గోగులకావలో పిలగా.. గోగులకావలో.. దబ్బున నీవు ఇంటికి రార సేనుకువోవాలో’ అంటూ సాగే ఈ పాటకు సాహిత్యం.. సంగీతం చరణ్‌ అర్జున్‌ అందించారు.

నిగ నిగ నిగసింగర్‌: సాహితీ చాగంటి
యాక్టర్‌: శివజ్యోతి
లిరిక్స్‌: మిట్టపల్లి సురేందర్‌
మ్యూజిక్‌: మదీన్‌ ఎస్‌కే
వ్యూస్‌: 1,63,393+
సమర్పణ: అల ప్రొడక్షన్‌
మిట్టపల్లి సురేందర్‌ రాసిన ‘నిగ నిగ నిగ సంక్రాంతి’ పాటలో పల్లెను.. పండుగను చక్కగా చూపించారు. ‘నిగనిగనిగ నెగడు నుండి పుట్టిన కాంతి సంక్రాంతి. ధగధగధగ మెడలో నగలను మించిన కాంతి సంక్రాంతి’ అంటూ స్టార్ట్‌ అయ్యే ఈ పాటకు మదీన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ‘కోడెల పౌరుషాన్ని కోట్లకు పందెమేసి మనుషులు ఓడిపోయే గెలుపుల కాంతి.. సంక్రాంతి’ అంటూ మరోసారి మెప్పించారు.

శ్రావణ భార్గవి ‘యేటిగట్టున పక్కన పచ్చని పైరు’ పాట ఈపోటీలో ఉంది. సత్యసాగర్‌ సాహిత్యం, సంగీతం సమకూర్చిన ఆ పాటను భార్గవితో కలిసి సాయి చరణ్‌ చక్కగా పాడారు. టిక్‌టాక్‌ స్టార్స్‌తో రూపొందించిన ‘తెలతెల్లా వారెనో’.. యశోకృష్ణ స్వరపరిచిన ‘తొలిమంచు తెరలతో’.. బిగ్‌బాస్‌-3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ‘రంగు రంగు రంగువళ్లులతో’ పోటీ పడుతున్నది. అమూల్య స్టూడియోస్‌ ‘వచ్చిందీ వచ్చిందీ సంక్రాంతి పాట కూడా పోటీలో ఉన్నది.

పండుగత్తాందంటే సాలుయాక్టర్‌: ఎల్‌బీ శ్రీరామ్‌
లిరిక్స్‌: మామిడి హరికృష్ణ
మ్యూజిక్‌: చరణ్‌ అర్జున్‌
సింగర్‌: చరణ్‌ అర్జున్‌
వ్యూస్‌: 25,892+
సంక్రాంతి సంబరాలే కాదు.. ప్రేమలు కూడా తీసుకొస్తుందని పాట ద్వారా చెప్తూ ఈ సంక్రాంతి పాటల పందాళ్లో దూసుకెళ్తున్నారు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. ఆయన రాసిన ‘పండుగత్తాందంటే సాలు.. దునియాలేని హైరానా పడుతడు మా నాయినా’ పాట ప్రతి ఒక్కరి జీవితాల్ని ప్రతిబింబింపచేస్తుంది. చరణ్‌ అర్జున్‌ లిరిక్స్‌, మ్యూజిక్‌ అందించిన ఈ పాటలో ఒక తండ్రి పండుగ కోసం ఎలా ఎందుకు ఎదురుచూస్తాడో చక్కగా వర్ణించారు.

రానే వచ్చింది హంగులతో


సింగర్‌: మధుప్రియ
డైరెక్టర్‌: కమల్‌ హరిపురం
లిరిక్స్‌: పుండరీక
మ్యూజిక్‌: బోలే శావలి
వ్యూస్‌: 7,25,961+
సమర్పణ: మ్యాంగో మ్యూజిక్‌
మధుప్రియ మ్యాంగో మ్యూజిక్‌ కలిసి సంక్రాంతికి చక్కని పాట తీసుకొచ్చారు. పండగ వైభవాన్ని పాటలో చక్కగా చూపించారు. ‘రానే వచ్చింది హంగులతో సిరిపూలా జల్లులతో ఈ నాడే సంక్రాంతి’ అంటూ సంక్రాంతికి స్వాగతం పలుకుతూ పల్లెల్లో ఈ మూడ్రోజులు జరిగే తంతు మొత్తం చూపించారు. ‘భోగీ భాగ్యాలే లోగిలిలో శుభ మకరాధారులలో సంబరమై సంక్రాంతి.. నేలతల్లి ముగ్గులతో పెట్టుకుంది కావిడి.. పచ్చిపాల మీగడల్లె స్వచ్ఛమైన సందడి. డుండుండుం బసవన్నల గిత్తల గారెడీ.. భోగిమంట చుట్టుచుట్టి చేసెనంట సవ్వడి’ అంటూ సంక్రాంతికి మనల్ని పలకరింపజేశారు.

- దాయి శ్రీశైలం

904
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles